Nov 09,2023 13:25

తెలంగాణ : బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ గజ్వేల్‌లో నామినేషన్‌ దాఖలు చేయగా, బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ గురువారం ఉదయం సిరిసిల్లలో నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు కెటిఆర్‌ హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో పూజలు చేసి తండ్రి సిఎం కెసిఆర్‌, తల్లి శోభమ్మల ఆశీర్వాదం తీసుకుని సిరిసిల్లకు బయలుదేరారు. అక్కడి ఆర్డీవో కార్యాలయంలో 11.45 గంటలకు నామినేషన్‌ దాఖలు చేశారు. నేడు ఆర్మూర్‌, కొడంగల్‌లో కెటిఆర్‌ రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈసారి గజ్వేల్‌, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ కొద్దిసేపటి క్రితం గజ్వేల్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. ఎర్రవల్లి నుంచి హెలికాప్టర్‌లో గజ్వేల్‌ చేరుకున్న ఆయన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) కు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. అనంతరం అక్కడి నుంచి కామారెడ్డికి బయలుదేరారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటలలోపు నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఆ తర్వాత అక్కడ నిర్వహించే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో కెసిఆర్‌ ప్రసంగించనున్నారు.