Oct 10,2023 21:42

ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం):వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌లోకి జిందాల్‌ యాజమాన్యాన్ని అడుగుపెట్టనిచ్చేది లేదని, ఆ కంపెనీని దొడ్డిదారిన ప్లాంట్‌లోకి తీసుకురావాలనే ఉక్కు యాజమాన్య నిర్ణయాన్ని అంగీకరించబోమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు స్పష్టం చేశారు. ఉక్కునగరంలో మంగళవారం పోరాట కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోరాట కమిటీ చైర్మన్‌ సిహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ ప్రయివేటీకరణపై ఉక్కు కార్మికుల పోరాటానికి భయపడి దొడ్డిదారిన ప్లాంట్‌లోని ఒక్కొక్క విభాగాన్నీ అమ్మకానికి పెడుతున్నారని అన్నారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకూ విస్తృత ప్రచారం చేపడతామన్నారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉక్కు మంత్రిని కలుస్తామని తెలిపారు. ఉక్కు పరిరక్షణ పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నామన్నారు. కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పోరాట కమిటీ చైర్మన్‌ డి ఆదినారాయణ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ మనుగడను దెబ్బతీసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందన్నారు. వాటిని ఐక్య పోరాటాలతో తిప్పికొడతామని చెప్పారు. పోరాట కమిటీ కో-కన్వీనర్‌ నీరుకొండ రామచంద్రరావు మాట్లాడుతూ స్థానిక స్టీల్‌ యాజమాన్యం హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. సమావేశంలో పోరాట కమిటీ కన్వీనర్‌ కెఎస్‌ఎన్‌ రావు, కో - కన్వీనర్‌ జె అయోధ్యరామ్‌, ఉక్కు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కెవిడి.ప్రసాద్‌, పోరాట కమిటీ నాయకులు యు రామస్వామి, వైటి దాస్‌, జె రామకృష్ణ, మసేన్‌రావు, వై మస్తానప్ప, బడ్డు పైడిరాజు, దొమ్మేటి అప్పారావు, వరసాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.