ప్రజాశక్తి-అమరావతి : కడప మున్సిపల్ మాజీ కమిషనరు, శ్రీశైలం ఆలయ ఇఒ లవన్నకు నెలరోజుల సాధారణ జైలు శిక్ష, రూ.15 వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. కోర్టు ధిక్కరణ కేసులో వెలువరించిన ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. అప్పటి వరకు తీర్పు అమలును నిలిపేస్తున్నట్లు జస్టిస్ ఎస్ సత్తిరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తన ఇల్లు, షాపుల్ని కూల్చివేత చర్యలు తీసుకుంటున్నారంటూ కడప హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పద్మావతి బారు 2020 జులైలో కేసు వేశారు. చట్ట నిబంధనలకు అనుగుణంగా చేయాలన్న ఉత్తర్వుల్ని కమిషనరు ఉల్లంఘించారని కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వుల ప్రతిని చించేశారని, పిటిషనరును పోలీసులు లాక్కెళ్లిన ఫొటోలు కూడా ఉన్నాయని ఆమె తరపున న్యాయవాది చూపించారు. వీటిని పరిశీలించిన తర్వాత నాటి కమిషనరుకు జైలు శిక్ష, జరిమానాను విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.










