Oct 10,2023 21:35

- 6వ బెటాలియన్‌లో జాగిలాల డెమో పరిశీలన
ప్రజాశక్తి - మంగళగిరి (గుంటూరు జిల్లా):ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న నేరాలకు అనుగుణంగా నేర పరిశోధనకు, నియంత్రణకు, తీవ్రవాద చర్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, ప్రముఖుల భద్రతా చర్యలకు అవసరమైన శిక్షణ జాగిలాలకు ఇవ్వడం ప్రశంసనీయమని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్‌ తానేటి వనిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి 6వ బెటాలియన్‌ ఇంటలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌లోని కెనైన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 21వ బ్యాచ్‌కు చెందిన 35 జాగిలాల డెమో ప్రదర్శనను హోం మంత్రి తిలకించారు. జర్మన్‌ షెఫర్డ్‌ ఇంగ్లీష్‌ కాకర్‌ స్పానియల్‌, గోల్డెన్‌ రిట్రైవర్‌, లాబ్రాడర్‌, బెల్జియన్‌ మెలినాయిస్‌ వంటి ఐదు జాతులకు చెందిన జాగిలాల విన్యాసాల ప్రదర్శనను, పోలీసుల ఔట్‌ పరేడ్‌ మార్చ్‌ ఫాస్ట్‌ను ఆసక్తిగా చూశారు. రాష్ట్ర విభజనానంతరం ప్రతికూల పరిస్థితుల మధ్య రాష్ట్రంలో పోలీసు జాగిలాలకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి, రాష్ట్ర పోలీసు వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా జాగిలాలకు శిక్షణ ఇచ్చి, విధులకు సన్నద్ధం చేస్తున్న అధికారులను, 54 మంది డాగ్‌ హ్యాండర్లను మంత్రి బహుమతులు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేర విచారణలో, నేరస్తుల జాడ పసిగట్టే ప్రక్రియలో, మత్తు, పేలుడు పదార్థాలను గుర్తించడంలో, శాంతి భద్రతల పరిరక్షణలో జాగిలాల పాత్ర ప్రశంసనీయమన్నారు. నేర పరిశోధనకు, నేర నియంత్రణకు, ప్రముఖ వ్యక్తుల వ్యక్తిగత భద్రత విధుల్లో, కొత్తగా ఏర్పాటు అయిన జిల్లాల అవసరాలకు అనుగుణంగా మరిన్ని జాగిలాలకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. కార్యక్రమంలో హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ హరీష్‌ కుమార్‌ గుప్తా, ఇంటలిజెన్స్‌ డిజిపి పి.ఎస్‌.ఆర్‌. ఆంజనేయులు, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ సర్వీసెస్‌ డిజిపి పి.వి.సునీల్‌ కుమార్‌, ఎపిఎస్‌పి అడిషనల్‌ డిజిపి అతుల్‌ సింగ్‌, ఎస్‌ఐబీ ఐజిపి వినీత్‌ బ్రిజ్‌ లాల్‌, ఇంటలిజెన్స్‌ డిఐజి కె.రఘురామ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.