Sep 14,2023 16:01

రాజమహేంద్రవరం: తమ అధినేత చంద్రబాబు సింహం లాంటి వ్యక్తి అని.. ఆయన దేనికీ భయపడరని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. చంద్రబాబు జైలు లోపల ఉన్నా సీఎం జగన్‌కు చెమటలు పట్టిస్తున్నారన్నారు. రాజమహేంద్రవరంలో మీడియాతో నారా లోకేశ్‌ మాట్లాడారు.''హైదరాబాద్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు. సైబర్‌ టవర్స్‌ నిర్మించి లక్షల మందికి ఉపాధి కల్పించారు. ఆధారాలు లేకుండా స్కామ్‌ జరిగిందని ఆయనపై ఇప్పడు కేసు పెట్టారు. చట్టాలను చుట్టాలుగా మారిస్తే సివిల్‌ వార్‌ మొదలుపెట్టాలి. చంద్రబాబు ఏ ఒక్క వర్గానికి కూడా ద్రోహం చేయలేదు. అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చి అమలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోరాటం చేసే అంశంపై కమిటీ ఏర్పాటు చేస్తాం. చర్చల తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం. రాబోయే రోజుల్లో కలిసి కట్టుగా పోరాడుతాం. జగన్‌ చేసిన ప్రతి తప్పును ప్రజాక్షేత్రంలో ఎండగడతాం'' అని లోకేశ్‌ వెల్లడించారు.