Jan 30,2023 12:23
  • ఉత్కంఠగా రెండో టీ20
  • కివీస్‌తో సిరీస్‌ సమం

లక్నో : ఆదివారం భారత్‌-న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌ అత్యంత ఉత్కంఠతో సాగింది. చివరికి ఒక్క బంతి మిగిలి ఉండగా, ఆరు వికెట్ల తేడాతో గెలిచిన భారత్‌ జట్టు ఊపిరి పీల్చుకుంది. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 100 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో భారత జట్టు చివరి ఓవర్‌ వరకూ శ్రమించాల్సి వచ్చింది. చివరి ఓవర్‌లో విజయం కోసం ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన పరిస్థితి. తొలి బంతికి ఒక పరుగు వచ్చినా రెండో బంతికి పరుగు రాలేదు. మూడు, నాలుగో బంతికి ఒక్కొక్క పరుగు వచ్చింది. ఐదో బంతికి సూర్య కుమార్‌ ఫోర్‌ కొట్టడంతో విజయాన్ని అందుకుంది. 26 పరుగులతో సూర్య కుమార్‌, 15 పరుగులతో హర్థిక్‌ పాండ్య నాటౌట్‌గా నిలిచారు. ఓపెనర్లు శుభమ్‌ గిల్‌ 11, ఇషాన్‌ కిషన్‌ 19 పరుగులు చేయగా, రాహుల్‌ త్రిపాఠి 13, వాషింగ్టన్‌ సుందర్‌ 10 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. మూడో టీ 20 ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌లో జరగనుంది.