- ప్రజల్లో ద్రవ్యోల్బణ భయాలు
- మూడొంతుల మందిలో ఆందోళన
- ఉద్యోగ కోతలపై పరేషాన్
- కాంతర్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో వేగంగా పెరుగుతోన్న ద్రవ్యోల్బణం పట్ల ప్రతీ నలుగురిలో ముగ్గురు తీవ్ర భయాలను వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ప్రతీ నలుగురిలో ఒక్కరు తమ ఉద్యోగం ఎప్పుడు ఊడుతోందోనని ఆందోళన వ్యక్తం చేశారని మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ సంస్థ కాంతర్ సర్వేలో వెల్లడయ్యింది. 2023లో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్థి చెందొచ్చని సగం మంది విశ్వాసం వ్యక్తం చేశారని పేర్కొంది. దేశంలోని 12 కీలక నగరాల్లోని 21-55 ఏళ్ల మధ్య వయస్సు గల 1,892 మంది వినియోగదారుల అభిప్రాయాలను సేకరించి ఈ రిపోర్టును రూపొందించింది. ఈ సర్వే ప్రకారం.. వచ్చే బడ్జెట్‌లో ఆదాయపు పన్నుకు సంబంధించిన పాలసీ మార్పులలో ప్రస్తుత రూ.2.5 లక్షల ప్రాథమిక ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని ప్రజలు కోరుకుంటున్నారు. ''2023లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్థి పెరుగొచ్చని 50 శాతం మంది నమ్ముతున్నారు. మందగమనం చోటు చేసుకోవచ్చని 31 శాతం మంది అభిప్రాయపడ్డారు. మెట్రోయేతర నగరాలు ఆశజనకంగా ఉన్నాయని 54 శాతం మంది పేర్కొన్నారు. కరోనా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం భారతీయులను తిరిగి ఆందోళనకు గురి చేస్తుంది.'' అని కాంతర్ రిపోర్టు పేర్కొంది.
''పెరుగుతున్న ద్రవ్యోల్బణం గురించి ప్రతీ నలుగురిలో ముగ్గురు ఆందోళన చెందుతున్నారు. ధరల కట్టడి పరిష్కారానికి ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అదే విధంగా ప్రతీ నలుగురిలో ఒక్కరు ఉద్యోగాల తొలగింపు ముప్పు గురించి ఆందోళన చెందుతున్నారు. వచ్చే బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితిని పెంచాలని ఆశిస్తున్నారు. ప్రాథమిక ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం అనేది ప్రజల్లో అత్యంత సాధారణమైన నిరీక్షణ.'' అని ఈ రిపోర్టు పేర్కొంది. ''బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణపై నిరంతరం దష్టి పెట్టాలని 55 శాతం మంది కోరుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోకుండా నిరోధించడానికి ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని చాలా మంది ఆశిస్తున్నారు. ఇది వారి కుటుంబ బడ్జెట్‌తో పాటు వారి ఉద్యోగ అవకాశాలను నేరుగా ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.'' అని కాంతర్ సౌత్ ఏసియా ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ దీపేందర్ రానా పేర్కొన్నారు.










