Apr 05,2023 11:18

ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : సునీత్‌ చోప్రా 1941 డిసెంబర్‌ 24న లాహౌర్‌లో జన్మించారు. ఢిల్లీలోని మోడరన్‌ స్కూల్‌, సెయింట్‌ కొలంబాస్‌ స్కూల్‌లో పాఠశాల విద్యా పూర్తి చేశారు. కలకత్తాలోని సెయింట్‌ జేవియర్స్‌ కాలేజ్‌లో చదివారు. యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌లో స్కూల్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ అండ్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌లో బిఎ ఆనర్స్‌ చదివారు. అక్కడ చదువుతున్నప్పుడే కమ్యూనిస్టు ఉద్యమంతో సంబంధాలు ఏర్పాడ్డాయి. అక్కడ తన విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే, పాలస్తీనాలో జరిగే విముక్తి ఉద్యమంలో చోప్రా భాగస్వామ్యం అయ్యారు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు)లో సెంటర్‌ ఫర్‌ స్టడీస్‌ ఇన్‌ రీజినల్‌ డెవలప్‌మెంట్‌ (సిఎస్‌ఆర్‌డి)లో పిహెచ్‌డిలో చేశారు. అక్కడ విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ, జవహర్‌లాల్‌ జెఎన్‌యులో ఎస్‌ఎఫ్‌ఐ వ్యవస్థాపక సభ్యుడుగా ఉన్నారు. సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ కరత్‌ ఆధ్వర్యంలో రూపొందించిన జెఎన్‌యుఎస్‌యు రాజ్యాంగాన్ని రూపకర్తల్లో సునీత్‌ చోప్రా ఒకరు. విద్యార్థి ఉద్యమం నుండి రిలీవ్‌ అయిన సునీత్‌ చోప్రా, డివైఎఫ్‌ఐ ఆవిర్భావంలో ఒకరిగా ఉన్నారు. 1972లో ఆయన సిపిఎం సభ్యత్వం తీసుకున్నారు. 1980లో డివైఎఫ్‌ఐ వ్యవస్థాపక కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1984లో డివైఎఫ్‌ఐ ఉపాధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత ఆయన వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమంలోకి వెళ్లారు. అక్కడ 1987లో కేరళలోని పాల్ఘడ్‌ ఎఐఎడబ్ల్యుయు సహాయ కార్యదర్శిగా ఎన్నిక అయ్యారు. 1995లో సునీత్‌ చోప్రా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2015 వరకు ఆయన ఆ బాధ్యతల్లో ఉన్నారు. ఇటీవలి (2023 ఫిబ్రవరి) పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో జరిగిన ఎఐఎడబ్ల్యుయు 10వ అఖిల భారత మహాసభల్లో ఆయన ఆ సంఘం సహాయ కార్యదర్శి బాధ్యతల నుంచి రిలీవ్‌ అయ్యారు. అయినప్పటికీ ఆయన సంఘం కార్యాలయానికి నిరంతరం వస్తూ సంఘం పనుల్లో భాగస్వామ్యం అవుతున్నారు. సునీత్‌ చోప్రా హాలండ్‌ పార్క్‌ స్కూల్లో సైన్స్‌ బోధించారు. ఆయన కళా విమర్శకుడు, రచయిత, కవి అనేక రచనలు చేశారు. పుస్తకాలు కూడా రాశారు. అలాగే జాతీయ దినపత్రికలు, మ్యాగజైన్‌లలో సాధారణ కాలమ్‌లు రాసే ప్రసిద్ధ మేథావి. ఆయన ఆల్‌ ఇండియా ఇండో-కొరియన్‌ ఫ్రెండ్‌షిప్‌ అసోసియేషన్‌కు ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు.
 

                                                                   ఉద్యమానికి తీరని లోటు..

చోప్రా మృతికి సంతాప సూచికగా ఎఐఎడబ్ల్యుయు తన పతాకాన్ని అవనతం చేసింది. సంఘం సహాయ కార్యదర్శిగాను సేవలందించిన చోప్రా ఇటీవలే రిలీవ్‌ అయ్యారు. ఆయన మరణం ఉద్యమానికి తీరనిలోటు అని ఎఐఎడబ్ల్యుయు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ విజయరాఘవన్‌, బి వెంకట్‌ ఒక ప్రకటనలో సంతాపం తెలియజేశారు. దేశంలోని వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల కోసం పోరాడిన వ్యక్తి సునీత్‌ చోప్రా అని కొనియాడారు. దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమంతో పాటు ప్రజాస్వామ్య, ప్రగతిశీల ఉద్యమాలకు కూడా తీరని లోటు అని పేర్కొన్నారు. సునీత్‌ చోప్రా జీవిత చివరి అంకం వరకు వ్యవసాయ కార్మిక ఉద్యమంలోనే ఉన్నారని, ఆయన నిరంతరం గ్రామీణ పేదల కోసమే ఆలోచించారని తెలిపారు. విద్యార్థి, యువజన సంఘాలకు నాయకత్వం వహించిన సునీత్‌ చోప్రా మరణం తమను ఎంతో బాధకు గురిచేస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నట్లు తెలిపింది.
 

                                                                అవిశ్రాంత యోధుడు..: ఏచూరి

సునీత్‌ చోప్రా మతి పట్ల సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషలిజం కోసం ప్రజాపోరాటాల్లో అర్ధ శతాబ్ద కాలం పాటు సహచరులు కలిసి ప్రయాణించామని ఏచూరి ఉద్వేగానికి గురయ్యారు. చోప్రా నిబద్ధత కలిగిన మార్క్సిస్టు అని కొనియాడారు. ప్రజల ప్రయోజనాల కోసం అవిశ్రాంతంగా పోరు సల్ఫిన యోధుడని స్మరించుకున్నారు.
 

                                                    విప్లవ దార్శనికుడు..: పినరయి విజయన్‌

చోప్రా మరణం పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తీవ్ర సంతాపం ప్రకటించారు. పెట్టుబడిదారీ అణచివేత సంకెళ్లను తెంచడానికి విప్లవ స్ఫూర్తి మూర్తీభవించిన ఒక దార్శనిక నాయకుడిని కార్మిక-కర్షక ఉద్యమం కోల్పోయిందని విజయన్‌ కొనియాడారు. ఆయన వారసత్వం మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. సామాజిక ఉద్యమకారిని తీస్తా సెతల్వాద్‌, సీనియర్‌ జర్నలిస్టు పరంజోరు గుహ ఠాకుర్తా ప్రభృతులు చోప్రా మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
          సునీత్‌ చోప్రా మృతి ప్రజా పోరాటాలకు తీరని లోటని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు దడాల సుబ్బారావు, వి వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల ప్రగాడ సంతాపాన్ని తెలిపారు.