Mar 13,2023 10:59

విజయనగరం : విజయనగరం జిల్లాలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జె.రమేష్‌ చంద్ర పట్నాయక్‌ సహా పలువురి ఉపాధ్యాయుల ఓట్లు గల్లంతవ్వడం కలకలం రేపింది. మరికొందరి ఓట్లు గుర్తు తెలియని వ్యక్తులు వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని కష్పా హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూతు వద్దకు వెళ్లిన యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు రమేష్‌ చంద్ర పట్నాయక్‌ ఓటును అధికారులు డిలీట్‌ చేశామంటూ స్టాంప్‌ వేసి ఓటు లేదని చెప్పారు. ఓటు హక్కు ఉన్నా డిలీట్‌ చేయడం అన్యాయమంటూ... రమేష్‌ చంద్ర పట్నాయక్‌ అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఓటు హక్కు ఇచ్చే వరకు వెళ్ళేది లేదని తేల్చి చెప్పి నిరసనలో కూర్చున్నారు. తమకు ఛాలెంజింగ్‌ ఓటు ఇవ్వాలని, ఎన్నికల జోనల్‌ అధికారిని యుటిఎఫ్‌ నాయకులు కోరారు. అదే కస్పా హైస్కూల్‌లో విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు వి.ఆనందరావు ఓటుని గుర్తుతెలియని వ్యక్తి వినియోగించుకోవడం విస్తుగొలిపింది. అధికార పార్టీ ఉపాధ్యాయులను టార్గెట్‌ చేశారనే విమర్శలు మరోవైపు వినిపిస్తున్నాయి. అన్ని పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు అధికారులు పోలింగ్‌ బూతు వద్ద కనిపిస్తున్నారు కానీ ఓట్లు గల్లంతవ్వడం, మరికొందరి ఓట్లను వేరొకరు వాడుకోవడంతో స్థానికంగా కలకలం రేగుతోంది.