జూన్‌లో 39% పెరుగుదల
సరుకుల ఎగుమతుల్లో 22 శాతం పతనం
20 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు
న్యూఢిల్లీ : భారత ఎగుమతుల్లో పతనం చోటు చేసుకుంది. మరోవైపు వంట నూనెల దిగుమతులు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఏడాది జూన్‌లో సరుకుల ఎగుమతులు 22 శాతం పతనమై 32.97 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఇదే సమయంలో 53.10 బిలియన్ల దిగుమతులు జరిగాయి. ఎగుమతులు తగ్గడం, దిగుమతులు ఎక్కువగా ఉండటంతో గడిచిన నెలలో భారత వాణిజ్య లోటు 20.13 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకుంది. ఇంతక్రితం నెలలో 34.98 బిలియన్ల ఎగుమతులు, 57.10 బిలియన్ల దిగుమతులు జరిగాయి. ప్రపంచ మార్కెట్లలో కొనసాగుతున్న స్తబ్దత ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్‌వాల్ అన్నారు.
2023 జూన్‌లో సర్వీస్ ఎగుమతులు 27.12 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 15.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం మేలో సర్వీసు రంగం ఎగుమతులు 25.30 బిలియన్లుగా, దిగుమతులు 13.53 బిలియన్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన కాలంలో సర్వీసెస్, సరుకుల ఎగుమతులు 7.3 శాతం తగ్గి 182.7 బిలియన్లుగా, దిగుమతులు 10.2 శాతం కోల్పోయి 205.29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
వంట నూనెల దిగుమతి మంట
గడిచిన జూన్ మాసంలో వంట నూనెల దిగుతులు ఏకంగా 39.31 శాతం పెరిగి 13.11 లక్షల టన్నులుగా చోటు చేసుకున్నాయని ఆ పరిశ్రమ బాడీ సాల్వెంట్ ఎక్స్టాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఇఎ) తెలిపింది. 2022 జూన్‌లో 9.41 లక్షల టన్నుల వంట నూనెల దిగుమతి జరిగిందని పేర్కొంది. గడిచిన నెలలో స్థూలంగా వంట నూనెల దిగుమతులు (వంట, వంటేతర నూనెలు) 49 శాతం పెరిగి 13.14 టన్నులుగా నమోదయ్యాయి. ఇవి గతేడాది ఇదే మాసంలో 9.91 లక్షల టన్నులుగా చోటు చేసుకున్నాయి. సబ్బు, ఒలియో కెమికల్ పరిశ్రమలు ఉపయోగించే వంటేతర నూనెలను 2,900 టన్నుల దిగుమతి జరిగింది. సన్ ఫ్లవర్ నూనెల దిగుమతులు మాత్రం 1.90 లక్షల టన్నులకు తగ్గాయి. ఇంతక్రితం నెలలో 2.95 లక్షల టన్నుల దిగుమతి నమోదయ్యింది. ఇండోనేషియా నుంచి వచ్చే ఫామ్ ఆయిల్ దిగుమతులు 4.76 లక్షల టన్నులకు పెరిగాయని ఎస్‌ఇఎ పేర్కొంది. బ్రెజిల్ నుంచి సోయాబిన్ చమురు దిగుమతులు 1.65 లక్షల టన్నులకు పెరిగినట్లు వెల్లడించింది.










