ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దులు, జిల్లా సరిహద్దుల్లో పోలీసు శాఖ ముమ్మర తనిఖీలు మొదలుపెట్టింది. ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ద్విచక్ర వాహనాలు సహా కార్లు, ఇతర వాహనాలను తనిఖీ చేస్తోంది. ఈ క్రమంలో సరైన పత్రాలు చూపని వారి నుంచి నగదును, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అప్పగించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో నిర్వహించిన తనిఖీల్లో సుమారు రూ.5 కోట్ల నగదు, 7 కిలోల బంగారం, 300 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రూ.41.8 లక్షల నగదును సీజ్ చేశారు. హైదరాబాద్‌లో నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు దొరికింది. కియా వాహనంలో రూ.3.35 కోట్లను స్వాధీనం చేసుకున్నట్టు వెస్ట్ జోన్ డిసిపి జోయల్ డేవిస్ తెలిపారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలంలో ఓ వాహనంలో 6,01,940 నగదును స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా అనుముల మండల కేంద్రంలోని హాలియా పాత ఐటి సమీపంలో ఆర్‌టిసి బస్సులో రూ.30 లక్షలు, దేవరకొండకు వెళ్తున్న ఆర్‌టిసి బస్సులో రూ.30 లక్షలు సీజ్ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గోసంపల్లె గ్రామంలో సుమారు 193 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నట్టు ఎస్‌ఐ లింబాద్రి తెలిపారు. కర్ణాటక నుంచి మద్యం వస్తుందన్న సమాచారంతో తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఎక్సైజ్ శాఖ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది.










