Sep 30,2023 11:07

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు నష్టం చేస్తున్న బిజెపికి వైసిపి రిటైల్‌గా అమ్ముడుపోయిందా? లేక టోకుగా అమ్ముడుపోయిందా? అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ప్రశ్నించారు. తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ సజ్జల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కమ్యూనిస్టులను కొనడం ఎవరి తరం కాదన్న ఆయన, బిజెపికి ఎందుకు మద్దతిస్తున్నారంటూ సిపిఎం లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం చెప్పడం చేతకాకే కమ్యూనిస్టులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. 'కేంద్రంలో ఉన్నట్టువంటి బిజెపికి లొంగిపోయి.. వాళ్లు ఆడమన్నట్టల్లా తైతక్కలాడుతూ.ఎక్కడ చేతులెత్తమంటే అక్కడ చేతులెత్తుతూ... ఏ చట్టం తెమ్మంటే ఆ చట్టం తెస్తున్నారు' అని విమర్శించారు. పార్లమెంటులో అడ్డగోలు ప్రజావ్యతిరేకమైన చర్యలకు కూడా మద్దతిస్తున్నారని అన్నారు. 'మిమ్మల్ని నమ్ముకున్న మైనార్టీలు, దళితులను కూడా మోసం చేసి. బిజెపి తెచ్చిన చట్టాలన్నింటికీ అనుకూలంగా మీరు ఓటు వేశారు. ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాసతీర్మానానికి వ్యతి రేకంగా ఓటువేశారు. వీటన్నింటికి కూడా మీరు ఎంతకు అమ్ముడుపోయారని మేం అడుగుతున్నాం.' అని ఆయన అన్నారు. 'రీటైల్‌గా అమ్ముడుపోయారో. ఒకేసారి టోకుగా అమ్ముడుపోయారా...బిల్లుబిల్లుకు ఇంతని తీసుకుంటున్నారా? బిజెపికి ఎందుకు మద్దతిస్తున్నారు?' అని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పడం చేతకాక, సిపిఎం తీసుకున్న రాజకీయ వైఖరికి సమాధానం చెప్పలేక తెలుగుదేశానికి అమ్ముడుపోయారని మాట్లాడుతున్నారని చెప్పారు. 'కమ్యూనిస్టులను కొనడం ఎవడి తరం కాదు.' అని ఘాటుగా స్పందించారు.