భువనేశ్వర్ : హాకీ పురుషుల ప్రపంచకప్ 2023 టైటిల్‌ను జర్మనీ గెలుచుకుంది. భువనేశ్వర్‌లో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియంపై జర్మనీ పెనాల్టీ షూటౌట్‌లో 5-4 తేడాతో ఘన విజయం సాధించింది. ప్రపంచకప్ కోసం చివరి నిమిషం వరకు ఇరు జట్లు హోరాహోరీ తలపడ్డాయి. అసాధారణ ఆట తీరుతో జర్మనీ ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఫైనల్లో తొలి క్వార్టర్‌లో బెల్జియం ఆటగాళ్లు వాన్ అయిబెల్, టాంగీ కోసిన్స్ చెరో గోల్ చేసి జర్మనీపై ఒత్తిడి పెంచారు. రెండో క్వార్టర్‌లో జర్మనీ ఆటగాడు నిక్లస్ వెల్లెన్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. మూడో క్వార్టర్‌లో జర్మనీ మరో గోల్ సాధించడంతో ఇరు జట్లు చెరో రెండు పాయింట్లు సాధించాయి. నాలుగో క్వార్టర్ ప్రారంభమైన మూడో నిమిషంలో జర్మనీ ఆటగాడు మాట్స్ గ్రాంబుష్ గోల్ చేసి డిఫెండర్ బెల్జియంపై ఒత్తిడి పెంచారు. చివరి నిమిషంలో బెల్జియంకు లభించిన పెనాల్టి కార్నర్‌ను గోల్‌గా మలచడంతో ఇరు జట్ల స్కోర్లు 3-3తో సమయ్యాయి. దీంతో విజేతను నిర్ణయించడం కోసం పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇందులో బెల్జియం నాలుగు గోల్స్ చేయగా, జర్మనీ ఐదు గోల్స్ సాధించింది. ఈ విజయంతో జర్మనీ ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఇది జర్మనీకి పురుషుల హాకీలో మూడో ప్రపంచకప్ కావడం విశేషం.










