శంషాబాద్ (హైదరాబాద్) : శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా ఆయన అధ్యక్షతన హైదరాబాద్‌లో నేడు, రేపు రెండు రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశం జరగనుంది. ఈరోజు జరిగే ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా హాజరుకానున్నారు. అదే సమయంలో రెండు రోజుల పాటు జరిగే ఈ సభకు దేశం నలుమూలల నుంచి కాంగ్రెస్ నేతలు తరలిరావడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ... శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద అధికారులు భారీ భద్రతను పెంచారు. ఎయిర్ పోర్ట్ నుండి సిడబ్ల్యుసి సమావేశం జరిగే ప్రాంతం వరకు వాహనాలతో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ఎక్కడికక్కడ మోహరించారు. వాహనశ్రేణిలో మొత్తం 30కి పైగా వాహనాలు పాల్గొననున్నాయి.
కాసేపట్లో భద్రతా సిబ్బంది ట్రయల్ రన్ ...
మరికొద్ది సేపట్లో భద్రతా సిబ్బంది ట్రయల్ రన్ ను ప్రారంభించనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ట్రాఫిక్ ను మార్చారు. ప్రయాణికులకు వేరే మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్ సాయంత్రం వరకు ఉంటాయని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచనలు జారీ చేశారు.










