ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ : సమాజం మార్పులో స్త్రీ పాత్ర ఎంతో కీలకమని, కానీ పాలకులు మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఎల్‌ఐసి వర్కింగ్ మహిళా కో-ఆర్డినేషన్ కమిటీ పేర్కొంది. శ్రీకాకుళంలోని హోటల్ గ్రాండ్‌లో ఎల్‌ఐసి ఉత్తరాంధ్రాలోని విశాఖ డివిజన్ మహిళా ఉద్యోగుల కో-ఆర్డినేషన్ కమిటీ రజతోత్సవ సభ శనివారం నిర్వహించారు. ఈ సభకు ఉభయ తెలుగురాష్ట్రాల ఎల్‌ఐసి మహిళా ఉద్యోగుల కన్వీనర్లు జి.సూర్యప్రభ, మైథిలి పాల్గొని మాట్లాడారు. ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల మహిళలు ఉపాధికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా ప్రారంభమైన నాటి నుంచి ఇది మరింత తీవ్రమైందన్నారు. మతోన్మాద బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, అణచివేత, లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలు పెచ్చు మీరిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. సిఐటియు రాష్ట్ర నాయకులు పి.మణి మాట్లాడుతూ.. మహిళలపై అత్యాచారాలు దాడులు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రపతికి తగిన ప్రాధాన్యత, గౌరవం ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం అవమానిస్తోందని తెలిపారు. పని ప్రదేశాల్లో సైతం మహిళా ఉద్యోగులపై వేధింపులు ఎక్కువుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో జిల్లా శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్ కె.నాగమణి, ఎల్‌ఐసి విశాఖ డివిజన్ ఉద్యోగుల యూనియన్ ప్రధాన కార్యదర్శి జి.వరప్రసాద్, ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 200 మంది మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.










