Sep 26,2023 20:52
  • కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కర్యాదర్శి మాల్యాద్రి
  • కోనసీమలో దళితుల హక్కులు - సామాజిక న్యాయం కోసం బైక్‌ ర్యాలీ

ప్రజాశక్తి- అమలాపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల హక్కులను కాలరాస్తున్నాయని కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి విమర్శించారు. సామాజిక న్యాయం, దళిత హక్కుల పరిరక్షణ కోసం మంగళవారం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర కోనసీమ జిల్లాలో అమలాపురం నుంచి ముమ్మిడివరం వరకూ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మాల్యాద్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు పైబడినా నేటికీ దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని అన్నారు. బిజెపి హయాంలో మనువాదుల ఆగడాలు పెచ్చురిల్లుతున్నాయని, మణిపూర్‌ ఘటనే దీనికి ఉదాహరణ అని తెలిపారు. ఈ ఘటనలను రాష్ట్రంలో పాలక వర్గాలు ఖండించకపోవడం శోచనీయమన్నారు. పాలక పార్టీలు దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని విమర్శించారు. బిజెపి కేంద్రంలో రెండవసారి అధికారంలోకొచ్చిన తర్వాత సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని రద్దు చేసిందన్నారు. రిజర్వేషన్లను అమలు చేయకుండా కుట్రలు పన్నుతోందని విమర్శించారు. లౌకిక రాజ్యాంగానికే ప్రమాదం పొంచి ఉందన్నారు. రాష్ట్రంలోనూ రోజురోజుకూ దళితులపై దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. వైసిపి సర్కార్‌ 9/77 అసైన్డ్‌ చట్టాలను కాలరాసి దళితులకు భూమి లేకుండా చేస్తోందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయకుండా ద్రోహం చేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో దళితుల హక్కులు - సామాజిక న్యాయం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతున్నామని, అందులో భాగంగానే సెప్టెంబర్‌ 29న విజయవాడలోని ధర్నాచౌక్‌ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి జి దుర్గా ప్రసాద్‌, కెవిపిఎస్‌, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.