Jul 03,2022 08:56

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు జరుపుకొంటున్న సమయంలో మన్యాన్ని, అడవిపై ఆదివాసుల హక్కుల్ని కాపాడడానికి ఆయన నాయకత్వంలో సాగిన పోరాటాన్ని గురించి మననం చేసుకోవాలి. తెలుగునాట జాతీయోద్యమ ఘట్టాల్లో మన్య పోరాటం ప్రముఖంగా నిలిచింది. ఈ సందర్భంగా అడవిని, అటవీ సంపదను కొల్లగొట్టడానికి నాటి బ్రిటిష్‌ పాలకుల మొదలు నేటి బిజెపి సర్కారు వరకూ చేపట్టిన విధానాలను రేఖామాత్రంగా ప్రస్తావించుకోవాలి.
         భూమి, అడవి, నీరు వంటివి సహజ వనరులు. వాటిని అనుభవించడం ప్రజల సహజసిద్ధమైన హక్కుగా ఉండేది. బ్రిటిష్‌ పాలన వచ్చాక రైత్వారీ, జమీందారీ, మహల్వారీ, ముఠాదారీ వంటి విధానాలతో భూమిని ఆస్తిగా మార్చారు. అడవిలో నివసించడం, అటవీ ఉత్పత్తులను సేకరించి అనుభవించుకోవడం ఆదివాసుల హక్కుగా ఉన్నదల్లా ఫారెస్టు చట్టాలు, పాలసీలు తెచ్చి వారిపై విషమ షరతులు విధించారు. ఇండియన్‌ ఫారెస్ట్‌ చట్టాన్ని 1865లో తెచ్చారు. దాంతో అడవిపై ప్రభుత్వానికి చట్టబద్ధమైన అజమాయిషీ వచ్చింది. 1878లో దాన్ని సవరించి దేశమంతటా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ చట్టంలోనే రిజర్వు ఫారెస్టు, రక్షిత ఫారెస్టులని వర్గీకరించారు. అడవి నుండి ప్రభుత్వానికి ఆదాయం సంపాదించడానికి కలప, అటవీ ఉత్పత్తులపై పన్నులు విధించారు. ఆ తరువాత 1894లో ఫారెస్ట్‌ పాలసీ తెచ్చారు. పర్యావరణ సమతుల్యత కోసం అడవులు ఉండాలన్న మంచి మాటలతోపాటు ప్రభుత్వా నికి అడవుల ద్వారా గరిష్ట ఆదాయం సమకూరడాన్ని ఆ పాలసీ లక్ష్యంగా పెట్టుకుంది. అడవులను మరోసారి వర్గీకరించి వాణిజ్య ఉత్పత్తి అడవులనే కొత్త కేటగిరీని ముందుకు తెచ్చారు.
        20వ శతాబ్ది చివర్లో తెచ్చిన చట్టాలు, పాలసీల అమలుతో 21వ శతాబ్ది ప్రారంభం నుండి అటవీ ప్రాంతాల్లోని ప్రజల బతుకులు అల్లకల్లోలమయ్యాయి. వీటికి తోడు రెవెన్యూ, ఫారెస్టు అధికారులు ఆదివాసులతో వెట్టి చాకిరి చేయించడం, జులుం చేయడం పెరిగింది. ఈ నేపథ్యంలోనే అడవిపైన, అటవీ ఉత్పత్తులపైన స్థానిక ప్రజల హక్కుల కోసం, అధికారుల జులుంను వ్యతిరేకిస్తూ అల్లూరి సీతారామరాజు ఉద్యమం ప్రారంభించాడు. అది మహౌద్యమంగా (1922-24) మారి చరిత్ర పుటల్లో మన్య విప్లవంగా పేరుగాంచింది. బ్రిటిష్‌ ప్రభుత్వం ఆ మహా వీరుడ్ని కాల్చి చంపి, ఉద్యమాన్ని రక్తపుటేరుల్లో ముంచింది. అయినా, ఆ పోరాటం అజరామరం!
          ఇప్పటికీ ఫారెస్టు చట్టాలకు మాతృకగా పేర్కొనే 1927 చట్టంలో మరిన్ని కట్టుదిట్టాలు చేశారు. స్వాతంత్య్రానంతరం వచ్చిన ఫారెస్ట్‌, వైల్డ్‌లైఫ్‌ చట్టాలు పర్యావరణ పరిరక్షణ గురించి పేర్కొన్నా అటవీ వాసులను మాత్రం ఆక్రమణదార్లుగానే చెప్పాయి. 2004లో యుపిఎ ప్రభుత్వానికి వామపక్షాలు వెలుపలి నుండి మద్దతునిచ్చిన సందర్భంలో వారి ఒత్తిడితో వచ్చిన అటవీ హక్కుల చట్టం (2006) ద్వారా మాత్రమే అడవిపై ఆదివాసులకు, స్థానికులకు హక్కుల కల్పన జరిగింది. అంతకుముందు 'ఆక్రమణదార్లు'గా చెప్పబడిన ప్రజలు ఆ చట్టంతో హక్కుదార్లయారు. అయితే, దాని అమలుకు సైతం పోరాటాలు చేసినచోటనే హక్కులు దక్కాయి.
         మోడీ ప్రభుత్వం వచ్చాక అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడవడానికి సకల యత్నాలూ చేస్తోంది. ఫారెస్టు పాలసీ సవరణకు పూనుకున్నారు. అందులో వివిధ అంశాలతోపాటు అటవీ ఉత్పత్తుల వాణిజ్యం, అటవీ ఆధారిత పరిశ్రమలు వంటివి చేర్చారు. ఇప్పటివరకు ఉన్న చట్టాల్లో ఫారెస్టుగా ప్రకటించినదానికి యజమాని ప్రభుత్వమే! దాన్ని ప్రజోపయోగ అవసరాలతోసహా దేనికైనా మళ్లించాలంటే కేంద్ర ప్రభుత్వ అటవీ పర్యావరణ శాఖనుండి క్లియరెన్సు కావాలి. కాని అడవిపై కార్పొరేట్ల యాజమాన్యానికి అవకాశం కల్పించాలని పాలసీ మార్పులో మోడీ ప్రభుత్వం ప్రతిపాదించింది. మరోవైపున అటవీ హక్కుల చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో కొందరు రిటైర్డు అధికారులు వేసిన కేసులో కేంద్ర ప్రభుత్వం తగిన వాదనలు చేయలేదు. సకాలంలో లాయర్లను సైతం పంపని పర్యవసానంగా రిజర్వు ఫారెస్టులోని ఆదివాసులను వెళ్లగొట్టాలంటూ కోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు, ప్రజా వ్యతిరేకత రావడంతో కేంద్రం పుర్విచారణ కోరడం, కోర్టు బేదఖలుకు గడువు పెంచడం మాత్రమే జరిగాయి తప్ప ఆదివాసుల మెడపై కత్తి పూర్తిగా తొలగిపోలేదు.
      ప్రభుత్వానికి గరిష్ట ఆదాయం సమకూరడం, అడవిని వాణిజ్యీకరించడం 1894 ఫారెస్ట్‌ పాలసీలో ముఖ్యాంశాలు. వాణిజ్య, ఆదాయ వనరుగా అడవిని చూసే పాలసీని తేవాలని మోడీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన రూపంలో తేడా అనిపించినా సారం ఒక్కటే! ఆనాటి బ్రిటిష్‌ పాలకులకు నేటి బిజెపి పాలనకు విధానాల్లో తేడా లేదు. అయినా, ఆదివాసులకు అండగా, అటవీ హక్కుల రక్షణ కోసం బ్రిటిష్‌ పాలకులకు ఎదురు నిలిచి ప్రాణాలొడ్డిన అల్లూరి త్యాగాన్ని తమ సొంతం చేసుకోవడానికి కాషాయ మూక యత్నించడం సిగ్గుచేటు.
                                                          - బి తులసీదాస్‌