Sep 29,2023 20:20
  • - ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసనలు
  • - పలు చోట్ల జిపిఎస్‌ ప్రతులు దగ్ధం

ప్రజాశక్తి-యంత్రాంగం : సిపిఎస్‌, జిపిఎస్‌లు వద్దని, పాత పెన్షన్‌ మాత్రమే కావాలని డిమాండ్‌ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యాన ఉపాధ్యాయులు శుక్రవారం పలు జిల్లాల్లో ఆందోళనలు చేశారు. అసెంబ్లీలో ఆమోదించిన జిపిఎస్‌ ప్రతులను దగ్ధం చేసి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నయవంచనకు పాల్పడుతోందన్నారు. అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందని ప్రశ్నించారు. తమకు పాత పెన్షన్‌ విధానమే అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. ఒపిఎస్‌ సాధించేవరకు తమ పోరాటం సాగుతుందని తెలిపారు.
కడప జిల్లా చాపాడులోని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జిపిఎస్‌ ప్రతులను దగ్ధం చేశారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని ఎంఆర్‌సి కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కరపత్రాలను విడుదల చేశారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోటలోని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఎంఇఒ కార్యాలయం వద్ద జిపిఎస్‌ ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు.