Oct 10,2023 12:20

పలాస (శ్రీకాకుళం) : మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను బడా వ్యాపారస్తులకు బలిపెడుతుందని.. రాబోయే ఎన్నికల్లో మోడీకి తగిన బుద్ధి చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జీడికి గిట్టుబాటు ధర కల్పించాలని, జీడి పంట సమగ్రాభివృద్దికై బోర్డు ఏర్పాటు కోసం మంగళవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాసలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో శ్రీనివాసరావు మాట్లాడుతూ .... రాష్ట్ర ప్రయోజనాలను బడా పెట్టుబడిదారులకు మోడీ ప్రభుత్వం కట్టబెడుతుందన్నారు. బడా వ్యాపారస్తుల కోరికలను తీర్చడానికే వారికి అనుకూలమైన చట్టాలను ప్రధాని మోడి తెచ్చారని అన్నారు. ప్రపంచాన్నే మింగేయగలిగిన బడా వ్యాపారస్తులు వారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రాన్ని అదానీకి అమ్మకానికి పెట్టేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విధంగా రైతుల ప్రయోజనాలను బలిపెడుతుంటే చూస్తూ ఊరుకోబోమని... కార్మిక, కర్షకులను ఏకం చేసి పోరాడతామని హెచ్చరించారు. ప్రజల నుండి అధిక మొత్తంలో సేకరిస్తున్న పన్నుల వసూళ్లతోనే ప్రభుత్వాధికారులంతా బతుకుతున్నారని... ఆ ప్రజల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను రారాజుని అని మోడీ చెప్పుకోవడానికి రాజరిక కాలం పోయిందని అన్నారు. ఇది ప్రజాస్వామ్యమని అన్నారు. నేతలు చెప్పే వాగ్దానాలు, హామీలను అమలు చేయాలన్నారు. ' రేవు దాటేవరకు ఓడ మల్లయ్య.. దాటిన తరువాత బోడి మల్లయ్య ' అని సామెత ఉన్నట్లు మోడీ పని అలాగే ఉందని ఎద్దేవా చేశారు. వారికి ఓట్లు అడిగేటప్పుడు ప్రజలు దేవుళ్లు-ఓట్లు అవ్వగానే ప్రజలు రాక్షసులు.. అని ప్రజలను రాక్షసుల్లా పీక్కుతింటారని మండిపడ్డారు. రాబోవు ఎన్నికల్లో ప్రజలంతా మోడి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

 జగన్‌ నాలుగేండ్ల వాగ్దానాల వైఫాల్యాలపై విరుచుకు పడ్డారు. 99 శాతం హామీలు నెరవేర్చాలని నిన్న విజయవాడ వైయస్సార్‌ సభలో మాట్లాడుతూ జగన్‌ చెప్పిన మాటలపై స్పందిస్తూ 99 శాతం ప్రజలకు ఒక్క శాతం వాగ్దానాలు అమలు చేసి ఒక్క శాతంగా ఉన్న అడాని లాంటి కార్పొరేట్లకు 99 శాతం అమలు చేశారని ఎద్దేవా చేశారు. నిజానికి జగన్‌ పాదయాత్ర సందర్భంగా చేసిన వాగ్దానాలు ఏమీ అమలు కాలేదని, ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న సిపియస్‌ రద్దు, ఎస్సీ, బీసీలకు సబ్‌ ప్లాన్‌ నిధులు, రైతులకు గిట్టుబాటు ధరలు, యువతకు డీఎస్సీ సహా జాబ్‌ కాలెండర్‌ వంటి ఏ హామీ అమలు చేయలేదని విమర్శించారు. పైగా ధరలు ఆకాశానికి అంటాయని, అక్క, చెళ్ళమలకు అన్నీ చేశానంటున్న జగన్‌ అషా, అంగన్వాడీ లకు జీతాలు ఎందుకు పెంచలేదో చెప్పాలన్నారు. వేలాది మంది గార్మెంట్‌, జీడి మహిళా కార్మికులు కనీస వేతనాలకు నోచుకోక 7-8 వేలకే వెట్టి చాకిరీ చేస్తున్నారని, అది జగన్‌ కళ్ళకు కనిపించడం లేదా అని వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు.