ప్రజాశక్తి - రాయదుర్గం (అనంతపురం) : విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం ఈనెల 30న ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా అనంతపురం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు శివ, గుంతకల్లులో రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్, జిల్లా ఉపాధ్యాక్షులు వెంకటేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ.. రాయదుర్గంలోని బళ్లారి బస్టాండ్ వద్ద తనకు నోటీసు ఇవ్వడం సరైన పద్ధతి కాదన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఇచ్చిన హామీలు మాటలకే తప్ప అమలుకు నోచుకోలేదని విమర్శించారు. పథకాల అమలు చేస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి... విద్యాదీవెన, వసతిదీవెన, అమ్మఒడి పథకాల్లో ఎందుకు కోతలు విధించారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇంటర్ విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేయడం సిగ్గు చేటన్నారు. డిగ్రీ విద్యలో 2018 నాటికి మూడు లక్షలు ఉండాల్సిన అడ్మిషన్లు 2023 విద్యాసంవత్సరానికి 1.20 లక్షలకు తగ్గడానికి ప్రభుత్వం విధానాలే కారణమని తెలిపారు.










