ప్రజాశక్తి-అమరావతి, అమరావతి బ్యూరో : స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను అక్టోబరు 4 వరకు అరెస్టు చేయొద్దని సిఐడికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేశారు. స్కిల్ కేసులో లోకేష్‌ను ఏదో ఒక రోజున సిఐడి అరెస్టు చేసే అవకాశం ఉందని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో లోకేష్‌పై వ్యవహరించబోయే తీరు తెలుస్తోందన్నారు. చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో సిఐడి పలు అంశాలను లేవనెత్తిందన్నారు. ఆ స్కాంలో అంతిమంగా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులే లబ్ధిదారులని చెబుతున్నందున ముందస్తు బెయిల్ కోరుతున్నట్లు చెప్పారు. స్కిల్ కేసులో లోకేష్ నిందితుడిగా లేరని, కేవలం భయంతోనే రిట్ దాఖలు చేశారని సిఐడి తరఫున ఎజి ఎస్ శ్రీరామ్ వాదించారు. నిందితుడు కానప్పుడు అరెస్టు ప్రస్తావనే ఉండదన్నారు. ఒకవేళ అరెస్టు చేయాలనుకుంటే ఎప్పుడో చేసుండే వాళ్లమని, ఏం చేసినా చట్ట ప్రకారమే చేస్తామని చెప్పారు. చంద్రబాబు రిమాండ్ రిపోర్టులోని అంశాలతో భయపడుతున్నట్లు ఉన్నారని అన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 41ఎ నోటీసు
ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ కేసులో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సిఆర్‌పిసిలోని 41ఎ నోటీసు జారీ చేసిన తర్వాతే విచారణ చేయాలని సిఐడిని హైకోర్టు ఆదేశించింది. తగిన గడువు ఇచ్చి విచారణ చేయాలంది. సిఆర్‌పిసి 41ఎ ప్రకారం నోటీసు ఇచ్చి, వివరణ తీసుకుంటామని సిఐడి తరఫున ఎజి ఎస్ శ్రీరామ్ హైకోర్టుకు ఇచ్చిన హామీకి అనుగుణంగా న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ అరెస్టు చేయాలన్నా 41(ఏ) (4) నిబంధనను అనుసరించి కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ లోకేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది.
నేడు ఢిల్లీకి సిఐడి
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఎపిసిఐడి బృందం శనివారం ఢిల్లీకి వెళ్లనుంది. ముందస్తు బెయిల్ ఇవ్వాలని లోకేష్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు అక్టోబరు 4కు వాయిదా వేసింది.లోకేష్ విచారణకు సహకరించాలని హైకోర్టు మధ్యంతర తీర్పు నేపథ్యంలో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సిఐడి బృందం శనివారం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిసింది.










