Aug 11,2022 22:21

ప్రజాశక్తి - చింతూరు, విఆర్‌.పురం (అల్లూరి సీతారామరాజు జిల్లా) :గోదావరి వరదతో నిండా మునిగిపోతున్నామని, పునరావాసం, పరిహారం కల్పించాలని కోరుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, విఆర్‌.పురం మండలాల్లో పోలవరం నిర్వాసితులు గురువారం జలదీక్షలు చేపట్టారు. 41.5 కాంటూరులో చింతూరును చేర్చాలంటూ నడుము లోతు వరద నీటిలో నిర్వాసిత ప్రజలు మూడు గంటల పాటు నిరసన తెలిపారు. ప్రధాన రహదారి బ్రిడ్జిపై రాస్తారోకో చేపట్టారు. జిల్లా కలెక్టర్‌ తక్షణమే రావాలని, కచ్చితమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. స్పందించిన కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆందోళనకారుల వద్దకు వచ్చి చర్చలు జరిపారు. ప్రతి సంవత్సరం ముంపు బారిన పడి సర్వస్వం కోల్పోతున్నామని, వస్తువులు, గొడ్డుగోదా నీటిపాలవుతున్నాయని, వరద తాకిడికి ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయని నిర్వాసితులు తెలిపారు. తమకు వెంటనే పోలవరం కాంటూరు 41.5లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్యాకేజీ ఇవ్వాలని, లేనిపక్షంలో ఈ వరదల్లోనే తాము కొట్టుకుపోవడం ఖాయమని కలెక్టర్‌ ఎదుట వాపోయారు. ఆయన స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సురేష్‌, నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, టిడిపి నాయకులు ఎమ్‌డి.జహంగీర్‌ పాల్గన్నారు. 41.5 కాంటూరులో తమను చేర్చి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, పునరావాసం కల్పించాలంటూ విఆర్‌.పురం మండలంలోని వడ్డిగూడెం గ్రామస్తులు వరద నీటిలోకి దిగి నిరసన తెలిపారు.