Jul 20,2023 07:28
  •  పోలవరంలో కచ్చితత్వాన్ని గుర్తించని ప్రభుత్వం
  •  ముందుకు సాగని పునరావాసం పనులు
  •  ఆందోళనలో నిర్వాసితులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు సంబంధించిన కాంటూర్‌ లెక్కలు గందరగోళంగా వున్నాయి. 2022లో గోదావరికి వచ్చిన వరదలతో కాంటూర్‌ లెవల్స్‌ ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో తేటతెల్లమైంది. ఆ వరదల్లో పునరావాస కాలనీ కూడా ముంపునకు గురికావడం నిర్వాసితులను మరింత ఆందోళనకు గురిచేసింది. గోదావరి నదికి 1986లో వచ్చిన వరద మట్టం 75 అడుగులు కాగా, 2022లో వచ్చిన వరదలు 71.2 అడుగులు మాత్రమే. అయితే 1986లో జరిగిన ముంపుకంటే 2022లో ముంపు ఎక్కువగా వుందని, కాఫర్‌ డ్యామ్‌తోనే ఇంత పెద్ద ముంపు ఏర్పడితే డ్యామ్‌ పూర్తిస్థాయి మట్టం 45.75 మీటర్లు కడితే తమ పరిస్థితి ఏమటనే నిర్వాసితులు ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేని పరిస్థితి వుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే నిధులిస్తామని, భూసేరకరణను రాష్ట్ర ప్రభుత్వమే భరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం పునరావాస పనులన్నిటినీ అటకెక్కించి కేవలం ప్రాజెక్టు నిర్మాణ పనులను మాత్రమే చేస్తోంది. దీంతో పోలవరం ప్రాజెక్టులో నిర్మాణ పనులు 79.6 శాతం పూర్తయితే, పునరావాసం పనులు 22 శాతం మాత్రమే జరగ్గా, కేవలం 11.9 శాతం కుటుంబాలను మాత్రమే పునరావాస కాలనీలకు తరలించారు. నిధుల విడుదలకు సంబంధించి కేంద్రం పెట్టిన తిరకాసులతో రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండు ప్యాకేజీలుగా విభజించింది. 41.15 మీటర్ల కాంటూర్‌ లెవల్‌కు ఒక ఫేజ్‌, 45.73 కాంటూర్‌ లెవల్‌కు రెండో ఫేజ్‌ కింద చేపడతామని ప్రకటించి ఆ మేరకు ఇప్పుడు మొదటి దశ పునరావాస పనులను మాత్రమే చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్క ప్రకారం పోలవరం ప్రాజెక్టు కింద మొత్తం 45.72 మీటర్లకు 373 నివాసిత గ్రామాలు ముంపునకు గురవుతున్నట్లు అంచనాలు కట్టింది. ఇందులో మొదటి దశలో 41.15 మీటర్లకు ఆరు మండలాల్లోని 123 నివాసిత ప్రాంతాల్లోని 20,946 కుటుంబాలు ముంపుబారిన పడుతున్నట్లు ప్రభుత్వం లెక్క చెబుతోంది. ఈ మేరకు ప్రభుత్వం ఎగువ ప్రాంతాల్లో పునరావాస గ్రామాల నిర్మాణాలకు పూనుకుంది. 213 పునరావాస గ్రామాల నిర్మాణాలు చేపట్టింది. అయితే 2022లో గోదావరికి వచ్చిన భారీ వరదలు ప్రభుత్వం చెబుతున్న ముంపు గ్రామాల లెక్క తప్పని ఆచరణలో రుజువైంది. కుకునూరు గ్రామంలో చేపట్టిన పునరావాస కాలనీ కూడా వరదలో ముంపునకు గురైంది. ప్రభుత్వం పూర్తి సురక్షిత ప్రాంతంలో కడుతున్నామని చెబుతున్న పునరావాస కాలనీలు కూడా ముంపునకు గురికావడంతో ముంపు ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరదలకే తీవ్ర ముంపు ఏర్పడితే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక పూర్తిస్థాయిలో (ఎఫ్‌ఆర్‌ఎల్‌) నీటిని నిల్వ వుంచితే ముంపు తీవ్రంగా వుంటుందని పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవల పొరుగు రాష్ట్రాలు 2022లో వచ్చిన వరదలకు ఏర్పడిన ముంపును పరిగణనలోకి తీసుకొని రీ సర్వే చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలవరం అథారిటీ లైడార్‌ సర్వే చేయగా, మరో 36 గ్రామాల పరిధిలో 48 నివాసిత ప్రాంతాలు కొత్తగా ముంపులోకి చేరాయి. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టులో ముంపు ఎంత అన్నది తేల్చి వారికి పునరావాసం పనులను ముందు చేపట్టాలని సిపిఎం డిమాండ్‌ చేస్తోంది. 2022 వరదలకు ముందు ప్రకారం భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి రూ.28,172.21 కోట్లు అవుతుందని అంచనా. ముంపుపై సమగ్ర సర్వే చేస్తే అంచనాలు మరింత పెరిగే అవకాశం వుంది. ఇందులో భూసేకరణ కోసం రూ.6,528 కోట్లు, ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీల నిర్మాణానికి రూ.12,218 కోట్లు, పునరావాసం కోసం రూ.7,234 కోట్లు అవసరమని అంచనా. ఏలూరు జిల్లాలో మూడు మండలాల్లో 137 నివాసిత ప్రాంతాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐదు మండలాల్లో 236 నివాసిత ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. ఏలూరు జిల్లాలో 34,697 కుటుంబాలు, ఎఎస్‌ఆర్‌ జిల్లాలో 71,309 కుటుంబాలు కలిపి మొత్తం 1,06,006 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి వుండగా కేవలం 12,658 కుటుంబాలను మాత్రమే ఇప్పటిదాకా తరలించారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల నిర్మాణం కూడా నత్తనడకన నడుస్తోంది. మొత్తం ముంపునకు గురయ్యే 373 నివాసిత ప్రాంతాలకు 213 కాలనీల నిర్మాణం చేయాల్సి వుండగా ఇప్పటిదాకా కేవలం 26 కాలనీలు మాత్రమే పూర్తయ్యాయి. పోలవరం ప్రాజెక్టులో స్ట్రక్షరల్‌ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నట్లుగా పునరావాసం పనులు జరగని పరిస్థితి వుంది. ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపు 80 శాతానికి చేరుకోగా పునరావాసం పనులు 22 శాతం వద్దనే వుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం పోలవరంలో పునరావాస పనులతో ప్రమేయం లేకుండా ప్రాజెక్టు పూర్తికి పరుగులు పెట్టించడం తగదని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేశాకే పోలవరం పనుల్లో ముందుకు వెళ్లాలని బాధితులు కోరుతున్నారు. కాంటూర్‌ లెక్కలతో ప్రమేయం లేకుండా 2022లో వచ్చిన వరద ముంపును ఆధారంగా పునరావాస ప్యాకేజీని అమలు చేయాలని బాదితులు కోరుతున్నారు.