Oct 01,2023 14:57

మందమర్రి: 60ఏళ్లలో ఏమీ చేయని కాంగ్రెస్‌, ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అంటూ వస్తోందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లాలో రూ.313 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మందమర్రిలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌తో కలిసి రోడ్‌షోలో పాల్గొన్న మంత్రి.. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. గతంలో ఓయూ విద్యార్థిగా ఉన్న బాల్క సుమన్‌ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని కేటీఆర్‌ గుర్తుచేశారు. నియోజకవర్గానికి మంత్రులుగా ఉన్న వాళ్లు చేయని పనులను సుమన్‌ చేసి చూపించారని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మంత్రి అయితే ఇంకా అద్భుతాలు చేస్తారన్నారు.మొండి చెయ్యి పార్టీని, చెవిలో పువ్వు పెట్టే పార్టీని నమ్మొద్దని ప్రజలను కేటీఆర్‌ కోరారు. ''150 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్‌ గ్యారెంటీ ఎప్పుడో తీరిపోయింది. కాంగ్రెస్‌ గెలిస్తే ఐదేళ్లకు ఐదుగురు సీఎంలు అవుతారు. సీఎంలుగా ఎవరు ఉండాలో కూడా ఢిల్లీ నుంచి కవర్‌ వస్తుంది'' అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.