ప్రజాశక్తి - పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) :ఏజెన్సీలో గత మూడేళ్లలో మంజూరు చేసిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు జెవి మురళి ఆదేశించారు. పాడేరు ఏజెన్సీ పర్యటనలో భాగంగా మంగళవారం ఐటిడిఎ కాన్ఫరెన్స్ హాల్‌లో డివిజన్ స్థాయి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిరక్ష్యం వీడాలన్నారు. నైపుణ్య శిక్షణకు రూ.40 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. గోకులం నిర్మాణాలను, మౌలిక సదుపాయాలు కల్పన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఎనిమిది వేల అటవీ హక్కు పత్రాల లబ్ధిదారుల వివరాలను గిరిభూమిలో నమోదు చేసి రైతు భరోసా అందేలా చూడాలన్నారు. బర్త్ వెయిటింగ్ హాల్స్ నిర్వహణపై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సికిల్ సెల్ ఎనీమియా నిర్ధారణ పరీక్షలకు అవసరమైన యంత్ర పరికరాలకు నిధులు విడుదల చేస్తామన్నారు. కాఫీ రేట్లు పెంచామని, ధరలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో పాడేరు ఐటిడిఎ పిఒ వి అభిషేక్, అధికారులు విఎస్ ప్రబాకర్, ఎం వెంకటేశ్వరరావు, ఐ కొండలరావు పాల్గొన్నారు.










