ప్రజాశక్తి-సూళ్లూరుపేట (తిరుపతి) : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్-3 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో ఈ ప్రయోగానికి గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ కౌంట్‌డౌన్ దాదాపు 25 గంటల పాటు సాగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం3-ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
చెంగాలమ్మ సేవలో ఇస్రో చైర్మన్ సోమనాధ్
తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటలో గల శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరిని ఇస్రో చైర్మన్ సోమనాధ్ గురువారం ఉదయం దర్శించి పూజలు చేశారు. శ్రీహరికోట నుండి రేపు జరిగే చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ సోమనాధ్ అమ్మరికి పూజలు చేశారు. ఆయనకు ఆలయం వద్ద ఈవో ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి స్వాగతం పలికారు. అమ్మ దర్శనం అనంతరం ఇస్రో చైర్మన్‌కు ఆలయ ఈవో ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భముగా సోమనాధ్ ప్రెస్‌తో మాట్లాడుతూ చంద్రయాన్ -3 ప్రయోగం రేపు మధ్యాహ్నం నిర్ణయించిన సమయం 2:35 గంటలకు జరుగుతుందని రాకెట్ ద్వారా చంద్రయాన్ ఎల్విఎం 3 ప్రయోగం జరుగుతుందని, ప్రయోగం అనంతరం 40రోజులు చంద్రయాన్-3 ప్రయాణం చేస్తుందని, ఆగస్టు 23 తరువాత చంద్రయాన్ -3 చంద్రుని పైకి దిగుతుందని ఆయన తెలియజేసారు. దీనికి సంబంధించి కౌంట్ డౌన్ గురువారం మధ్యాహ్నం 1.05 గంటకు ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. తరువాత ప్రయోగం పిఎస్ఎల్వి రాకెట్‌ను వాణిజ్య పరంగా ప్రయోగిస్తున్నట్లు తెలిపారు. అలాగే వచ్చే నెల చివరిలో ఆదిత్య ఉపగ్రహ ప్రయోగం ఉంటుందని దానికి సంబందించిన ఉపగ్రహ పరీక్షలు జరుగుతున్నాయని తెలియజేసారు.చంద్రయాన్-1 ప్రయోగం సూపర్ హిట్ అయిందని దాని ద్వారా చంద్రునిపై నీటి జాడలను గుర్తించడం జరిగిందని.. అలాగే చంద్రయాన్-2 కూడా మంచి ఫలితాలు ఇచ్చిందని నీరు ఉన్నట్లు రుజువు చేసిందని అంతకన్నా మరింత ఫలితాలను చంద్రయాన్-3 ఇస్తుందని సోమనాధ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ముప్పాళ్ల చంద్ర శేఖర్ రెడ్డి, ఎం.ఎం పద్మజ, షార్ గ్రూప్ మేనేజర్ గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.