Oct 01,2023 10:46

న్యూఢిల్లీ : అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17 ఎ ప్రకారం గవర్నర్‌ ముందస్తు అనుమతి లేకుండా తనపై పెట్టిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలని కోరుతూ టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన కేసు జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మంగళవారం నాటి కేసుల జాబితాలో 63వ ఐటం కింద దీన్ని లిస్ట్‌ చేసింది.

చంద్రబాబునాయుడు దాఖలుచేసిన క్వాష్‌ పిటిషన్‌ను సెప్టెంబరు 22న ఏపీ హైకోర్టు కొట్టేయడంతో దాన్ని సవాలు చేస్తూ ఆయన ఆ మరుసటిరోజున సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలుచేశారు. గత సోమవారం ఆ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేశారు. అప్పట్లో సీజేఐ మంగళవారం మెన్షన్‌ చేయాలని సూచించారు. అయితే ఆ రోజు అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కూర్చోవడంతో సీజేఐ ధర్మాసనం ముందు మెన్షనింగ్స్‌ లేకపోవడంతో చంద్రబాబు కేసును గత బుధవారం జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్‌ ధర్మాసనం ముందు లిస్ట్‌ చేశారు. జస్టిస్‌ భట్‌ వైదొలగడంతో జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా కేసును తదుపరి వారానికి వాయిదావేస్తూ, ఈ కేసును జస్టిస్‌ భట్‌ సభ్యుడిగా లేని ధర్మాసనానికి పంపాలని ఆదేశించారు. అయితే కేసు అత్యవసర నేపథ్యంలో ... వెంటనే విచారణ చేపట్టాలని కోరుతూ చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థలూథ్రా అదేరోజు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేశారు. అందుకు స్పందించిన సీజేఐ... 3న తగిన బెంచ్‌ దానిపై విచారిస్తుందని చెప్పి వాయిదా వేశారు. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఈ కేసును 6వ ధర్మాసనం ముందు లిస్ట్‌ చేసింది.