ప్రజాశక్తి-అమరావతి : ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు పేరుతో పలు అక్రమాలు జరిగాయంటూ సిఐడి నమోదు చేసిన కేసులో తాను అరెస్టు అయినట్లుగా పరిగణించాలన్న (డీమ్డ్) పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన తరుణంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. సాధారణ పద్ధతిలోనే పిటిషన్‌ను విచారిస్తామని జస్టిస్ కె సురేష్‌రెడ్డి ప్రకటించారు. బుధవారం విచారణ చేపడతామని తెలిపారు. ఈ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే వరకు ఇన్నర్ కేసులో తనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు పిటిషన్‌లో కోరారు.
- నారాయణ బావమరిది కేసులో..
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ బావమరిది, ఆ కేసులో17వ నిందితుడు ఆవుల మునీ శంకర్ కూడా హైకోర్టును ఆశ్రయించారు.
- నారాయణ కేసు నేటికి వాయిదా
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణకు హాజరుకావాలని సిఐడి జారీ చేసిన నోటీసును కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. పోలీసుల వాదన తెలియజేయాలని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్‌రెడ్డిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివిఎస్‌ఎన్ చక్రవర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్నర్ కేసులో నారాయణను విచారించడం తప్పనిసరని సిఐడి భావిస్తే, తన ఇంటి వద్దనే విచారించేలా ఉత్తర్వులివ్వాలని ఆయన తరఫున న్యాయవాది వాదించారు.
- సిఐడి విచారణకు హాజరవ్వండి
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణకు తమ ఎదుట హాజరుకావాలని సిఐడి జారీ చేసిన నోటీసును కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ అల్లుడు కె పునీత్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిష్కరించింది. జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. పిటిషనరు సిఐడి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పిటిషనర్‌ను విచారించాలని, న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని సిఐడిని ఆదేశించారు. మధ్యాహ్నం గంటపాటు లంచ్ విరామం ఇవ్వాలన్నారు.
- అంగళ్లు కేసులో చంద్రబాబు అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు
అన్నమయ్య జిల్లా, అంగళ్లు వద్ద జరిగిన గొడవల నేపథ్యంలో టిడిపి నేతలపై ముదివీడు పోలీసులు నమోదుచేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. దీనిని సాధారణ పద్ధతిలోనే విచారణ చేపడతామని జస్టిస్ కె సురేష్‌రెడ్డి ప్రకటించారు.










