గుర్తింపుకు నోచుకోని అమరవీరుల జీవితాలను వెలుగులోకి తెస్తామనే పేరుతో వారి వారసత్వాన్ని సొంతం చేసుకోవాలని బిజెపి ప్రయాసపడుతోంది. స్వాతంత్య్ర సమర యోధుడు రామరాజును తన ఖాతాలో వేసుకోవడం ద్వారా తెలుగువారిలో పట్టు సాధించవచ్చని కలలు కంటోంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, అటవీ హక్కుల చట్టం నిర్వీర్యం వంటి వాటితో సహా తమ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల జ్ఞాపకాల నుంచి తుడిచివేయడానికి బిజెపి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రేమాభి మానాలను చూరగొన్న విప్లవ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు. తన సహచరులైన గాం గంటయ్య దొర, గాం మల్లయ్య దొర, పడాలు, అగ్గిరాజు తదితరులతో కలిసి బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై యుద్ధం చేశాడు. ఇది రామరాజు 125వ జయంతి సంవత్సరం, మన 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంవత్సరంతో కలిసి వచ్చింది. బిజెపి, సంఘపరివార్‌లు వారికి సహజసిద్ధంగా అబ్బిన, బతకనేర్చిన పద్ధతి ప్రకారం అల్లూరి వారసత్వాన్ని సొంతం చేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. సంఫ్‌ుపరివార్ సిద్ధాంతానికి అంకితమైన కార్యకర్తగా ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటించి, రామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళ్లు అర్పించే పనిలో ఉన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నడయాడిన ప్రాంతాన్ని 'అభివృద్ధి' చేయాలనే దానిపై అమితమైన ఆసక్తి వెలిబుచ్చుతున్నారు. నిజానికి వారు ఎంత ప్రయాసపడ్డా, గంగలో నీళ్లన్నీ తెచ్చి శుద్ధి చేసుకున్నా, లేక అరేబియా అత్తర్లన్నీ పూసుకున్నా దేశ స్వాతంత్య్ర పోరాటానికి ఉద్దేశ్యపూర్వకంగానే బహుదూరంగా ఉన్నారన్న విషయం దాచినా దాగని సత్యం.
'ప్రజలకు, ముఖ్యంగా యువతకు అల్లూరి సీతారామరాజు మహోన్నత జీవితం గురించి కేంద్రప్రభుత్వం బోధపరచాలని కోరుకుంటున్నది' అని కేంద్ర పర్యాటక, సాంస్కతిక శాఖామంత్రి కిషన్‌రెడ్డి ప్రకటన చేశారు. ఈ సందర్భాన్ని బిజెపి ఏవిధంగా సొంత ప్రయోజనాలకు వాడుకోదలుచుకున్నదో వివరిస్తుంది. మంత్రి ప్రకటన ప్రకారం, విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు మ్యూజియం ఏర్పాటు చేస్తారట. అల్లూరి పుట్టిన, విద్యనభ్యసించిన స్థలాన్ని, ఆయన పోరాటం చేసిన ప్రాంతాన్ని అభివద్ధి చేస్తారట. 'ఈ సీతారామరాజు ప్రాజెక్టు విషయంలో ప్రధాని స్వయంగా ఆసక్తి చూపిస్తున్నారు' అన్నారు. రామరాజును స్వాతంత్య్ర పోరాటంలో ఒక పౌరాణిక వ్యక్తిలాగా కీర్తించటానికే ఈ ప్రాజెక్టు ఉపయోగపడేలా ఉంది.
అధికారం చేతిలో ఉండటంతో సంఘపరివార్ తన ఎజెండాను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళుతున్నది. దాని అనుంగు సైనికులు చరిత్రను వక్రీకరించటంలోనూ, అబద్ధాలు సష్టించటంలోనూ, బ్రిటిష్ దమననీతికి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు సాగించిన పోరాటానికి మతతత్వ రంగులు రుద్దటంలో తలమునకలై ఉన్నారు. రామరాజును 'హిందూ రుషి' గానూ, 'మతం వల్ల సాధించిన శక్తితో జ్ఞాన సంపన్నుడైన సన్యాసి' గానూ చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల అనేక భాషల్లో రూపొందిన తెలుగు సినిమా చారిత్రక వాస్తవాలను ప్రచారంలో పెట్టడానికి బదులు రామరాజు చరిత్రను చిత్రవిచిత్ర కల్పితాలతో నింపి, ఆ విధంగా వీరికి మేలు చేసింది.
1897లో జన్మించిన అల్లూరి సీతారామరాజు పుట్టిన ఊరు పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు. తల్లిదండ్రులు అతనికి పెట్టిన పేరు శ్రీరామరాజు, ఆ తరువాత పేరులో 'సీత'ను కలిపారు. వివిధ అధ్యయనాల ప్రకారం, తన సోదరినో, లేక తను ప్రేమించిన యువతినో (వలసవాద వ్యతిరేక పోరాటంలో నిమగమైనందువల్ల పెళ్లి చేసుకోలేదు.) గౌరవిస్తూ పేరులో కలిసింది. లేక అతని పట్ల ఉన్న ప్రేమాభిమానాల వల్ల ప్రజలు కలిపినది కూడా అయ్యిండవచ్చు.
ప్రొఫెసర్ మురళి పేర్కొన్నట్లు.. అల్లూరి సీతారామరాజు 'రూపం అనేక కల్పనలతో తయారుచేయబడ్డది'. ఆయన పొడవైన ఎర్రటి ఖద్దరు చొక్కా, నిక్కరు వేసుకుని గిరిజనులు నివసిస్తున్న ఏజెన్సీలలో తిరుగుతుండేవాడు. వైద్య మూలికలు పంచుతూ, జ్యోతిష్యం, హస్త సాముద్రికాలను కూడా చెపుతూ ఉండేవాడు. అతని నిరాడంబర జీవన విధానం, ఇతరులకు సహాయం చేసే స్వభావం గిరిజన ప్రజల నుండి గౌరవ మర్యాదలను పొందాయి. వారు అతనికి మంత్రశక్తులను ఆపాదించారు. ఈ అపోహలకు రాజు అడ్డుపడలేదు. జనవరి 30, 1922లో కేడిపేట ఏజెన్సీ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ విచారిస్తున్నప్పుడు ప్రజలు 'తననొక పవిత్ర వ్యక్తి'గా చూస్తున్నారని, తను 'పితూరీ'ని ప్రారంభిస్తున్నట్టు నమ్ముతున్నారని, 'ప్రతి ఒక్కరూ వచ్చి, తనని అడిగేవారని, అటువంటిది ఏమీలేదని తను ఖండించినప్పటికీ, ఆ ఖండనను చాలామంది అంగీకరించలేదు' అని చెప్పినట్టు ఆ నివేదికలు సూచిస్తున్నాయి.
అనేక మంది స్వాతంత్య్ర పోరాటయోధులు, 20వ శతాబ్దం తొలి దశకాలలో ప్రజలను సమీకరించటానికి మత భావనలను, చిహ్నాలను వాడుకున్నారు. స్కూల్లో రామరాజు క్లాస్‌మేట్ అయిన అన్నపూర్ణయ్య ఇలా పేర్కొన్నారు.. 'రామరాజు ఆధ్యాత్మిక సందేశాలు ఇచ్చేవాడు. కానీ పాల వంటి అతని ఆధ్యాత్మికతలో చక్కెర లాంటి దేశభక్తి కచ్చితంగా మిళితమై ఉండేది.' దీని అర్థం రాజు మతతత్వవాది కాదు. ఇతర మతాల పట్ల వివక్ష చూపలేదు. అతను నిచ్చెన మెట్ల కులవ్యవస్థను, కుల వివక్షలను వ్యతిరేకించాడు.
రాజు కుటుంబ వారసుల్లో ఒకరిని ఉటంకిస్తూ వచ్చిన నివేదికలు అతని (రాజు) తల్లి సనాతన ధర్మాన్ని పాటించేవారని, నిమ్న కులాల వ్యక్తులను తమ ఇంట్లోకి రానిచ్చేవారు కాదని పేర్కొంది. ఇటువంటి వాతావరణంలో పెరిగిన రాజు ఆ సనాతన విశ్వాసాలను అనుసరించలేదు. పైగా దీనికి విరుద్ధంగా వివక్షల అమలుకు వ్యతిరేకిగా ఉన్నాడు. గిరిజన ప్రజలతో బాగా కలిసిపోయేవాడు. వారి ఇళ్ళల్లో బస చేసేవాడు. వారిలో ఒకరిగా ఉన్నాడు. మరీ ముఖ్యంగా వారి సామాజిక-ఆర్థిక సమస్యల పట్ల సానుభూతితో ఉండేవాడు.
రామరాజును 'హిందూ మత నాయకుడు'గా చూపాలని ఆర్‌ఎస్‌ఎస్-బిజెపిలు చేస్తున్న ప్రయత్నాలు ఆయన వారసత్వానికి జరుగుతున్న ఘోర అపకారం. అదేవిధంగా కుల సంస్థలు రామరాజు పుట్టుకను బట్టి ఆయన్ని కుల ఆధారంగా చూడటమూ నేరమే. ఇది ఆయన విశాల మానవతా ప్రపంచ దక్పథాన్ని తిరస్కరించడం తప్ప మరొకటి కాదు.
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రామరాజు చేసిన తిరుగుబాటు ఆనాటి (1920 తొలినాళ్ళల్లో) వలసవాద ప్రభుత్వం పట్ల ప్రజలలో వున్న తీవ్ర వ్యతిరేకతకు ప్రతిరూపం. మన్యం ప్రాంతంలోని గిరిజనులలో రాజకీయ
చైతన్యం పెంచటంలో రామరాజు దోహదపడ్డాడు. తరువాత ఆ మన్య ప్రాంతమే అతని పోరాట కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్నది. గిరిజనుల సాధకబాధకాలను ఉపయోగించుకుని, వారిని ప్రేరేపించి, వారి ఆగ్రహాన్ని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రూపుదిద్దాడు. 1860 నాటి నుంచి మన్యం ప్రాంతం గిరిజనుల దోపిడీకి వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు నడవటం చూసింది. కానీ, 1922-1924 మధ్యకాలంలో రామరాజు చేసిన తిరుగుబాటు గుణాత్మకంగా భిన్నమైనది. ఈ తిరుగుబాటు రెండేళ్లు జరిగిందనే కాదు, ఈ తిరుగుబాటు స్వభావరీత్యానూ భిన్నమైనది. ప్రొఫెసర్ మురళి ఇలా రాశారు.. 'మునుపటి తిరుగుబాట్ల వరుసలో కాకుండా, రాజు వలసవాద వ్యతిరేక భావజాలంతో గిరిజనుల వ్యక్తిగత కష్టాలను జోడించగలిగాడు. తద్వారా కొండిపాంత ప్రజలలో కొత్త సామూహిక రాజకీయ చైతన్యాన్ని సష్టించగలిగాడు. ఇదే అతని తిరుగుబాటును నిజమైన ప్రజల తిరుగుబాటుగా మార్చింది.'
పోడు వ్యవసాయం, చిన్నపాటి అటవీ ఉత్పత్తులు పోగుచేసుకునే హక్కును నిషేధించిన వలసరాజ్యంపై రామరాజు తిరుగుబాటు ప్రధానంగా జరిగింది. బ్రిటిష్ వారి పనులను చేస్తున్న కాంట్రాక్టర్లు రోడ్లు వేయటం లాంటి వివిధ పనులలో గిరిజనులను పెట్టుకునేవారు. ఆ కాంట్రాక్టర్లు సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగానూ ఈ తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటుకు సంబంధించిన కారణాలపై ఏజెన్సీ ఆపరేషన్స్ కామాండింగ్ ఆఫీసర్ ఏ.జె.హప్పెల్ ఇచ్చిన విస్తత నివేదిక ప్రకారం.. ''ప్రభుత్వం వేస్తున్న రహదారి పనులలో బలవంతంగా పనిచేయించటం, వ్యవసాయ సంక్షోభం, బాస్టియన్ వలన బాధలకు గురయిన మాజీ మున్సిఫ్‌లు, మాజీ ముఠాదార్లతో ఏజెన్సీ మండటానికి సిద్ధంగా ఉన్న భాస్వరంలా ఉండింది. అదే గిరిజనులను పోరాటంలోకి నెట్టింది.' బ్రిటిషర్ల ఆర్థిక సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులు చేసిన తిరుగుబాటు ఇది.
తిరుగుబాటుతో బ్రిటిష్‌వారు అదిరిపోయారు. రామరాజును పట్టుకోవటానికి, తిరుగుబాటును అణచటానికి పెద్దఎత్తున సైనిక బలగాలను దింపారు. రాజును పట్టుకోవటంలో పోలీసులు విఫలం కావటంతో, గెరిల్లా యుద్ధ తంత్రాలలో ఆరితేరిన మలబార్ స్పెషల్ పోలీసులను దింపారు. ఆ తరువాత ఈ బలగాలకు అస్సాం రైఫిల్స్‌ను జతకలిపింది. ఈ కార్యక్రమానికి బ్రిటిషర్లు మొత్తంగా రూ.40 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. గ్రామాలను తగలబెట్టారు, పంటలను ధ్వంసం చేశారు, ఆడవారిని బలాత్కరించారు, ప్రజలను అమానుషమైన పద్ధతిలో రకరకాలుగా హింసించారు. ఇంత క్రూరమైన అత్యాచారాలు తమపై జరిగినప్పటికీ ప్రజలు తిరుగుబాటు పట్ల అంకితభావంతో ఉన్నారు. ఎన్నడూ రామరాజునిగాని, అతని తిరుగుబాటు బందానికి గాని ద్రోహం చేయలేదు. 1924లో రామరాజును పట్టుకుని కాల్చిన తరువాతనే బ్రిటిష్‌వారు గాలి పీల్చుకోగలిగారు. అప్పటికి రామరాజు వయస్సు 27 ఏళ్లు.
రామరాజు యొక్క వారసత్వం ఆర్థిక దోపిడీకి, కులవివక్షకు వ్యతిరేకంగా, ఓరిమితో ఉండటం కోసం నిలబడటంలో ఉంది. ఇది సంఘపరివార్ డిఎన్‌ఎకే వ్యతిరేకం. బ్రిటిష్ వలస పాలనతో పోరాడిన చరిత్ర దీనికి లేదు. పోరాడి సాధించుకున్న సార్వభౌమత్వం, స్వాతంత్య్రంపై రాజీపడటానికి బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం నానా విధాలుగా ప్రయాసపడుతున్నది.
అందరినీ కలుపుకునే (ఇన్‌క్లూజివ్) సమాజాన్ని నిర్మిస్తామని ఎన్ని బడాయి మాటలు చెప్పినప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి చేతలు మాత్రం 'అగ్రకుల' ఆధిపత్యం వైపేనని సూచిస్తున్నాయి. రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాలకు, దేశం నలుమూలలా దళితులు, ఆదివాసీలపై జరిగే దాడులు, అకత్యాలపై బహిరంగంగాను, చాటుమాటుగా తెలిపే మద్దతు, దళితులు, ఆదివాసీలకు మద్దతుగా నిజంగా ఉపయోగపడే అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఒక పద్ధతి ప్రకారం తొలగిస్తూ పోవటం, వీటితోపాటు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించే చట్టాలు చేయటానికి నిరాకరించటం- ఇవన్నీ నిమ్న కులాల పట్ల బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కు వున్న స్వాభావిక వ్యతిరేక ధోరణికి రుజువులు.
ప్రస్తుతం మైనార్టీలపై జరుగుతున్న దాడులు, ప్రజలు అనుసరించే మత విశ్వాసాల ఆధారంగా బుద్ధిపూర్వకంగా వారి మధ్య చీలికలు తెచ్చే ప్రయత్నం. ఎవరు ఏ దుస్తులు వేసుకున్నారు? ఏం తింటున్నారు? లాంటి వాటిపై నిఘా పెట్టడం, నియంత్రంచ చూడటం రామరాజు దేని కోసం నిలబడ్డాడో దానికి విరుద్ధం. ఈ కారణాలతో, ఆర్‌ఎస్‌ఎస్-బిజెపిలకు అల్లూరి సీతారామరాజును సొంతం చేసుకునే మాట అటుంచి, ఆయనను గురించి మాట్లాడే అర్హత కూడా లేదు.
భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకుని వాస్తవాలను వక్రీకరించేందుకు సంఘపరివార్ ప్రయత్నిస్తున్నది. స్వతంత్రం కోసం జరిగిన పోరాటంలో సంఘపరివార్‌కు లేని పాత్రను ఆపాదించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నది. వలసపాలన నుండి దేశ స్వాతంత్య్రం కోసం మాత్రమే కాక, కులమతాల ఆధారంగా ప్రజల మధ్య వివక్షను చూపే తిరోగమన పద్ధతులు, ఆలోచనలకు వ్యతిరేకంగా నిలబడిన ఎందరో అమరులున్నారు. గుర్తింపునకు నోచుకోని అమరవీరుల జీవితాలను వెలుగులోకి తెస్తామనే పేరుతో వారి వారసత్వాన్ని సొంతం చేసుకోవాలని బిజెపి ప్రయాసపడుతున్నది. స్వాతంత్య్ర సమరయోధుడు రామరాజును తన ఖాతాలో వేసుకోవడం ద్వారా తెలుగువారిలో పట్టు సాధించవచ్చని కలలు కంటోంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, అటవీ హక్కుల చట్టం నిర్వీర్యం వంటి వాటితో సహా తమ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల జ్ఞాపకాల నుంచి తుడిచివేయడానికి బిజెపి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటోంది.
ప్రజలకున్న జ్ఞాపకశక్తి తక్కువది కాదు. మరచిపోయి క్షమించే స్థితిలో వారు లేరని పాపం బిజెపి గ్రహించలేకపోతున్నది. సీతారామరాజు బోధించిన ఒక విషయం ప్రజలకు బాగా గుర్తుంది. 'దేశ శ్రేయస్సు కోసం, మీరు చేయవలసింది ఏమీ లేదు, పోరాటం కొనసాగించటమే.
- ఆర్. అరుణ్ కుమార్ సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు










