ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పధకం కింద వైద్య సేవలందించే ఆసుపత్రులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. ఫలితంగా పేదలకు ఉచితంగా అందాల్సిన వైద్య సేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదు. ప్రభుత్వం శాసనసభ సాక్షిగా చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆసుపత్రులకు రూ.1944.13 కోట్లు ఖర్చు చేసినట్లు ఒక వైపు చెబుతూనే ఆసుపత్రులకు నేటికీ రూ.536.07కోట్లు బకాయిలు ఉన్నట్లు పేర్కొంది. అదే విధంగా ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఇహెచ్‌ఎస్) కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.269.34 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంటున్నప్పటికీ మరొక వైపు ఆసుపత్రులకు రూ.30.07 కోట్లు బకాయిలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. బిల్లుల పెండింగ్ ఉన్న ఆసుపత్రుల యాజమాన్యాలకు బిల్లులు ఈ నెలలో కొంత జమ అవుతాయని, వైద్య సేవలు నిలిపివేయవద్దని వైద్య ఆరోగ్యశాఖ కో ఆర్డినేటర్లు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రూ.50 లక్షలు చెల్లించాల్సిన ఆసుపత్రులకు రూ.5, రూ.6 లక్షలు చెల్లింపులు చేయించి వైద్య సేవలు నిలిపివేయకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ఫలితంగా కొంత మేర చిన్న చితకా వ్యాధులకు వైద్య సేవలందిస్తున్నట్లు తెలిసింది.










