- రూ.3.40కోట్లకు బెంగళూరు కొనుగోలు
- గార్డినర్, స్కీవర్‌లకూ అత్యధిక ధర
- ముగిసిన మహిళల ప్రిమియర్ లీగ్ వేలం
- 87 ఆటగాళ్లకు జాక్‌పాట్.. 322మందికి నిరాశ
ముంబయి : మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్)లో భారత ఓపెనర్ స్మతి మంధాన రికార్డు ధర పలికింది. భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేలంలో మంధానాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.3.40కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. దీంతో డబ్ల్యూపిఎల్ తొలి సీజన్ వేలంలో మంధాన అత్యంత విలువైన ప్లేయర్‌గా రికార్డు నమోదు చేసింది. ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో తొలి సీజన్‌కు 409మంది ప్లేయర్‌కు వేలం రేసులో నిలువగా.. కేవలం 87మంది ఆటగాళ్లు మాత్రమే అమ్ముడయ్యారు. మిగిలిన 322మందికి మొండిచెయ్యి లభించింది. ఆరంభ సీజన్‌లో ఆడే అవకాశం దక్కిన క్రికెటర్ల కుటుంబ సభ్యులు బంధువులకు మిఠాయిలు తినిపించి ఆనందోత్సవాల్లో మునిగారు. ఇక విదేశీ క్రికెటర్లలో బ్యాటర్ అష్‌లీ గార్డ్‌నర్(ఆస్ట్రేలియా), నటాలియా స్కీవర్(ఇంగ్లండ్) రూ.3.20 కోట్ల ధరతో రెండో స్థానంలో నిలిచారు. గార్డ్‌నర్‌ను గుజరాత్ జెయింట్స్, నటాలియాను ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేశాయి. ఐదు ఫ్రాంచైజీలు కనీసం 24మంది తగ్గకుం డా ప్లేయర్స్‌ను కొనుగోలు చేసుకోవాల్సి ఉంది. ఒక్కో ఫ్రాంచైజీ రూ.12కోట్లకు తగ్గకుండా నగదును ఖర్చుచేయాల్సి ఉంది.
అండర్ -19 ప్లేయర్స్ హవా
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో భారత క్రికెటర్ల పంట పండింది. ముఖ్యంగా అండర్ -19 జట్టులోని కీలక ప్లేయర్స్ హవా కొనసాగింది. వీళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛేజీలు పోటీ పడ్డాయి. కోట్లు కుమ్మరించేందుకు సిద్ధపడ్డాయి. అండర్ -19 టీమ్ కెప్టెన్, లేడీ సెహ్వగ్‌గా పేరొందిన షఫాలీ వర్మ భారీ ధర పలికింది. ఆమెను రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. వికెట్ కీపర్ రీచా ఘోష్‌ను రూ.1.90 కోట్లకు ఆర్సీబీ, హర్మన్‌ప్రీత్ కౌర్(ఆల్‌రౌండర్) రూ. 1.80 కోట్లు, యస్టికా భాటియా (వికెట్ కీపర్) రూ. 1.50 కోట్లు, రేణుకా సింగ్(పేసర్) రూ.1.50 కోట్లు, స్నేV్‌ా రాణా (ఆల్‌రౌండర్) రూ.75 లక్షలు పలికారు.
ఫ్రాంచైజీలు కొనుగోలు చేసిన దేశ, విదేశీ ఆటగాళ్లు
దేశీయ విదేశీ మిగులు నగదు
1. ముంబయి 17 6 ---
2. గుజరాత్ 18 6 రూ.5లక్షలు
3. యుపి 16 6 ---
4. ఢిల్లీ 18 6 రూ.35లక్షలు
5. బెంగళూరు 18 6 రూ.10లక్షలు












