Jan 27,2023 20:59

హిండెన్‌బర్గ్‌ దెబ్బకు షేర్ల విలవిల
నాలుగో వంతు విలువ పతనం
రూ.4 లక్షల కోట్లు ఫట్‌
మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి

న్యూఢిల్లీ : అదానీ గ్రూపు కంపెనీలు మోసపూరిత చర్యలతో స్టాక్స్‌ విలువను పెంచుకుంటాన్నాయని.. తప్పుడు ఎకౌంట్స్‌కు పాల్పడుతున్నాయని.. మనీలాండరింగ్‌ చేస్తున్నాయని అమెరికన్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్టు దెబ్బ అదానీ షేర్లకు పెను గాయాన్ని చేశాయి. ఆ రిపోర్ట్‌ ప్రభావంతో నాలుగోవంతు విలువ కోల్పోయాయి. రెండు సెషన్లలో అదానీకి చెందిన 10 లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.4 లక్షల కోట్లు ఆవిరయ్యింది. హిండెన్‌బర్గ్‌ రిపోర్టుతో బుధవారం ఒక్క సెషన్‌లోనే రూ.1 లక్షల కోట్ల విలువను కోల్పోగా.. శుక్రవారం సెషన్‌లో దాదాపు రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. ఇంట్రాడేలో ఈ సూచీలు 5-25 శాతం క్షీణించాయి. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ నిరాధారమైందని.. ఆ సంస్థపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అదానీ గ్రూపు ప్రకటించినప్పటికీ.. ఇన్వెస్టర్లు విశ్వసించలేకపోయారు. మరోవైపు అదానీ గ్రూపు అవకతవకలపై తాము ఏ విచారణకు అయినా సిద్దమని.. తమ రిపోర్టుకు కట్టుబడి ఉన్నామని హిండెన్‌బర్గ్‌ ప్రకటించడం అదానీ షేర్లను మరింత ఒత్తిడికి గురి చేసింది. జనవరి 24న అదానీ గ్రూపు కంపెనీల మార్కెట్‌ కాపిటలైజేషన్‌ విలువ రూ19 లక్షల కోట్లుగా ఉండగా.. జనవరి 27 ముగింపు నాటికి రూ.15 లక్షల కోట్లకు పరిమితమయ్యింది. అదానీ షేర్లలో అమ్మకాల వల్ల ఎల్‌ఐసి దాదాపు రూ.18వేల కోట్ల నష్టాన్ని చవి చూసింది. అదానీ గ్రూపులోని కంపెనీల్లో జనవరి 24 నాటికి ఎల్‌ఐసి పెట్టుబడి రూ.81,268 కోట్లుగా ఉండగా.. 27 నాటికి ఇది రూ.62,621 కోట్లకు పడిపోయింది. అదానీ గ్రూపు అవకతవకలపై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ను అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారుడు బిల్‌ అక్‌మాన్‌ సమర్థించారు. ''ఆ రిపోర్ట్‌ అత్యంత విశ్వసనీయమైనది, చాలా లోతుగా పరిశోధించబడిందని'' అక్‌మాన్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు.

రెండు సెషన్లలో అదానీ షేర్ల పతన తీరు

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ -19.77%
అదానీ పోర్ట్స్‌ - 21.58%
అదానీ విల్మర్‌ -9.74%
అదానీ గ్రీన్‌ -22.46%
అదానీ పవర్‌ -9.72%
అదానీ ట్రాన్స్‌మీషన్‌ -27.08%
అదానీ టోటల్‌ -24.76%
ఎసిసి -19.52%
అంబూజా సిమెంట్‌ -23.75%


ఎఫ్‌పిఒపై నీలినీడలు
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పిఒ) శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో పెట్టుబడులకు బుధవారం యాంకర్‌ ఇన్వెస్టర్లను స్పందన రాగా.. శుక్రవారం రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి అనాసక్తి వ్యక్తమయ్యిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఎఫ్‌పిఒ జనవరి 31 వరకు కొనసాగనుంది. ఎఫ్‌పిఒలో ఒక్కో షేరును రూ.3,112 - రూ.3,276 ధరల శ్రేణిలో విక్రయించనున్నారు. తాజా ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం షేరు ధర ఎఫ్‌పిఒ ధర కంటే కిందకు చేరి రూ.2,768 వద్ద నమోదవుతోంది. దీంతో ఈ ఎఫ్‌పిఒ ఫ్లాప్‌ కానుందని అంచనాలు వెలుపడుతున్నాయి.

కుబేరుల్లో ఏడో స్థానానికి అదానీ..
హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ దెబ్బకు అత్యంత కుబేరుడైనా గౌతం అదానీ సంపద కీలకమైన 100 బిలియన్ల మార్క్‌కు దిగువకు పడిపోయింది. రెండు రోజుల్లో ఆయన కంపెనీల షేర్ల పతనంతో ప్రపంచ సంపన్నుల జాబితాలో అదానీ ర్యాంకింగ్‌ ఏడో స్థానానికి పడిపోయింది. ఇంతక్రితం ఆయన నాలుగో స్థానంలో ఉన్నారు. కొన్ని నెలల క్రితం ఓ దశలో రెండో స్థానానికి ఎగబాకగా.. చాలా కాలం మూడో స్థానంలో కొనసాగారు.
మార్కెట్లకు భారీ నష్టాలు
అదానీ గ్రూపునకు చెందిన సూచీల భారీ పతనం స్థూలంగా బిఎస్‌ఇ సెన్సెక్స్‌, నిఫ్టీలపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. వారాంతం సెషన్‌లో మార్కెట్లు కుప్పకూలి.. మూడు నెలల కనిష్టానికి పడిపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1000 పాయింట్ల మేర కోల్పోగా.. తుదకు 874.16 పాయింట్ల నష్టంతో 59,331 కనిష్టానిక దిగజారింది. ఇది 2022 అక్టోబర్‌ 21 నాటి కనిష్ట స్థాయి. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 288 పాయింట్లు కోల్పోయి 17.604 వద్ద ముగిసింది. రెండు రోజుల వరుస నష్టాలతో మదుపర్లు దాదాపు రూ.10.65 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బడ్జెట్‌నకు ముందు ఈ పరిణామం ప్రభుత్వ వర్గాలను ఆందోళనకు గురి చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. భారత మార్కెట్లలో క్షీణత ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీయనుందని బ్రోకర్లు భావిస్తన్నారు.