Jul 03,2022 10:23

బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని గడగడలాడించిన స్వాతంత్య్ర పోరాటయోధుడు, తెలుగు జాతి పౌరుషాగ్ని, విప్లవ కిశోరం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి జులై 4. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కేంద్రంలో మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం అమృతోత్సవ్‌ పేరిట చరిత్రలో మరుగునపడ్డ స్వాతంత్య్ర సమరయోధులను వెలుగులోకి తెస్తామని బయలుదేరింది. ఈ కార్యక్రమం స్వాతంత్య్ర సమరయోధులను గౌరవించి, స్మరించుకునే ఉద్దేశంతో కాదు. తన హిందూత్వ-మతోన్మాద ఎజెండాకు మరింత పదునుపెట్టే పన్నాగంలో భాగం. స్వాతంత్య్రోద్యమంతో వీసమెత్తయినా సంబంధం లేని, ఉద్యమానికి ద్రోహం చేసి, ఆంగ్లేయ వలస పాలకులకు విధేయులుగా వ్యవహరించిన వారు స్వాతంత్య్ర సమరయోధులను తమలో కలుపుకోడానికి, వారి వారసత్వాన్ని కబ్జా చేయ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మన అల్లూరిని సైతం వదిలిపెట్టనంటున్నారు. వర్తకం ముసుగులో దేశాన్ని ఆక్రమించి, తమ కిరాతక దోపిడీతో ఇక్కడి ప్రజల మాన, ప్రాణాలను హరిస్తున్న బ్రిటిష్‌ సామ్రాజ్యవాదంపై రామరాజు సమరశంఖం పూరించాడు. ఆంగ్లేయులను తరిమికొట్టి, దేశాన్ని దాస్యశృంఖలాల నుండి విముక్తి చేసే బృహత్‌ కర్తవ్యాన్ని భుజానికెత్తుకొని, వెనక్కి తిరిగి చూడలేదు. బ్రిటిష్‌ ఉన్నతాధికారులు సంధి పేరిట జరిపిన చర్చల్లో వారు వేసిన ఎరలకు లొంగకుండా, సింహలా గర్జించి మన్యం ప్రజలతో కలిసి సాయుధ తిరుగుబాటు చేశాడు. చివరికి బ్రిటిష్‌ వారి చేతిలో బందీ అయ్యాక కూడా తన ఆశయాన్ని విడిచిపెట్టకుండా తన వీర మరణం స్వాతంత్య్రోద్యమకారులకు స్ఫూర్తి కావాలని కోరుకొన్నాడు. అందుకే ఆంగ్లేయ సేనల బూటకపు ఎన్‌కౌంటర్‌లో సంతోషంగా ప్రాణార్పణ చేశాడు. అప్పటికి సీతారామరాజు వయసు కేవలం 27 ఏళ్లు మాత్రమే.
ఆరాధ్య దైవం
ప్రస్తుత బిజెపి మాతృక ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనకుండా పూర్తిస్థాయిలో తనను తాను మినహాయించుకుంది. దేశమంతా స్వాతంత్య్రోద్యమంలో తలమునకలై ఉంటే దేశంలో మతోన్మాద కలహాలు చేపట్టడంలో ఆర్‌ఎస్‌ఎస్‌ తన శక్తియుక్తులన్నింటినీ వెచ్చించింది. స్వాతంత్య్రోద్యమానికి, ఆర్‌ఎస్‌ఎస్‌కు బంధాన్ని కలిపే వారధి సావర్కర్‌ అన్న ఒక్క పేరు మాత్రమే. ఇదీ తప్పుడు ఆధారాలతో నిర్మించినది. హిందూ మహాసభ ప్రముఖ నేత వి.డి. సావర్కర్‌ దేశాన్ని హిందూరాష్ట్రగా మార్చాలని ప్రబోధించాడు. హిందూత్వ అనేది మత క్రతువు కాదు.. అదొక రాజకీయ సిద్ధాంతం, విధానం అని పేర్కొన్నాడు. బిజెపి తొలుత సావర్కర్‌ను తమ ఆరాధ్యుడిగా బహిరంగంగా వెల్లడించలేదు. 1989లో కానీ, 1991లో కానీ బిజెపి ఎన్నికల ప్రణాళికలలో హిందూత్వ ప్రస్తావన చేయలేదు. 1996లో దాన్ని చేర్చారు. దాని సృష్టికర్త సావర్కర్‌ను 2002 లోనే కీర్తించారు. వాజపేయి ప్రభుత్వంలో అప్పటి హోంమంత్రి ఎల్‌కె అద్వానీ పోర్ట్‌బ్లేయర్‌ ఎయిర్‌పోర్టుకు సావర్కర్‌ పేరు పెడతారన్న సందర్భంలో ముందుకు తెచ్చారు. అది గుజరాత్‌లో మోడీ సి.ఎం.గా ఉండగా.. జరిగిన గోధ్రా అల్లర్ల సమయం. 2015లో సావర్కర్‌ 132వ జయంతి రోజున ప్రధాని హోదాలో మోడీ సావర్కర్‌ను భారతమాతకు నిజమైన కుమారునిగా అభివర్ణించారు. ఎందరికో తిరుగులేని స్ఫూర్తి అని,దేశ చరిత్రకు కృషి చేసిన అమూల్యమైన నాయకుడని స్మరించారు.
సాగిలపాటు
బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులను ఎదురొడ్డి దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు చిరుప్రాయంలో ప్రాణాలర్పించిన అల్లూరి సీతారామరాజుకు, బిజెపి స్వాతంత్ర సమరయోధునిగా ఆకాశానికెత్తే సావర్కర్‌కు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నందుకు ఆరెస్టయిన సావర్కర్‌ను 1911 జులై 4న అండమాన్‌ సెల్యూలర్‌ జైలుకు తరలించగా, కేవలం నెల లోపు జైలు కష్టాలకే బ్రిటిష్‌ సర్కారుకు క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకున్నాడు. తన విడుదల కోసం బ్రిటిష్‌ వారి దయ కోసం వేడుకున్నాడు. 1913 నవంబర్‌ 14న ఆయన రాసిన రెండవ క్షమాభిక్ష పిటిషన్‌ 'తన పార్టీలోని ఇతర దోషులు తన కంటే మెరుగైన సదుపాయాలు పొందుతున్నార'ని ప్రారంభమవుతుంది. 1906-07లో దేశంలో ఉత్సాహభరిత-నిస్సాహాయ పరిస్థితి కారణంగా రాడికల్‌ వైపు తప్పుదారి పట్టినట్లు, తన మనస్సాక్షిగా ఒప్పుకుంటున్నట్లు బ్రిటిష్‌ వారికి సావర్కర్‌ హామీ ఇచ్చాడు. దయతో తనను విడుదల చేస్తే ఆంగ్లేయ ప్రభుత్వానికి విధేయుడిగా ఉంటానన్నాడు. దేశంలో, విదేశాల్లో తన బోధనలతో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా మారి, తప్పుదారి పట్టిన వారందరినీ తిరిగి వెనక్కి తీసుకొస్తానని, బ్రిటిష్‌ ప్రభుత్వంలో ఏ హోదాలోనైనా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సాగిలపడ్డాడు. జైలులో ఫోర్‌మెన్‌గా నియమించబడ్డాడు. మెరుగైన సదుపాయాలు పొందాడు. 1920, మార్చి 30న రాసిన నాల్గవ క్షమాభిక్ష పిటిషన్‌లో ఆసియాలోని మతతత్వ సమూహాలు ఉత్తరం వైపు నుండి దేశంపై దండయాత్ర చేసే ముప్పు ఉందని, దేశ ప్రయోజనాల కోసం హృదయపూర్వకంగా విధేయతతో బ్రిటిష్‌ సర్కారుకు సహకరిస్తానని ప్రాధేయపడ్డాడు. ఇలాంటి పలు అర్జీల తర్వాత సెల్యూలర్‌ జైలులో పదేళ్ల జైలు శిక్ష అనంతరం 1921లో రత్నగిరి జైలుకు సావర్కర్‌ మార్చబడ్డాడు. రత్నగిరిలో ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదన్న షరతుపై 1924లో జైలు నుండి విడుదల కాబడ్డాడు. 1937 వరకు సదరు షరతులు అమల్లో ఉన్నాయి. ఆ తర్వాత ఎత్తివేయబడ్డాయి. 1948లో మహాత్మాగాంధీ హత్య కుట్ర కేసులో సావర్కర్‌ విచారణ ఎదుర్కొన్నారు. సాంకేతిక కారణాలతో బయటపడ్డారు. 1966లో మరణించాడు.
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు..
అల్లూరి సీతారామరాజు సామ్రాజ్యవాద బ్రిటిష్‌ వలస పాలకులపై మడమ తిప్పకుండా పోరాడి తృణప్రాయంగా ప్రాణాలర్పించగా సామ్రాజ్యవాదులతో రాజీపడి అత్యంత హీనస్థాయిలో లొంగుబాటుకు దిగజారారు బిజెపి వారసులు. అల్లూరి సీతారామరాజు వారసత్వాన్ని బిజెపి దురాక్రమణ చేయప్రయత్నిస్తే, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది.

- కెఎస్‌వి ప్రసాద్‌