- ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్
భువనేశ్వర్: ఎఫ్‌ఐహెచ్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు 9వ స్థానంలో నిలిచింది. 9-12 స్థానాలకు శనివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 5-2గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. తొలి అర్దభాగం ముగిసే సరికి భారత్ 2-0గోల్స్ ఆధిక్యతలో నిలిచింది. ఆ రెండు గోల్స్‌ను తొలి క్వార్టర్‌లోనే వచ్చాయి. తొలి గోల్‌ను అభిషేక్(5వ ని.), రెండో గోల్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్(12వ ని.)లో పెనాల్టీని గోల్‌గా మలిచాడు. షంషేర్‌సింగ్(45వ ని), ఆకాశ్ దీప్ సింగ్(49వ ని.)లో ఒక్కో గోల్ కొట్టారు. సుఖ్‌జీత్(59వ ని.)లో మరో గోల్ కొట్టినా.. దక్షిణాఫ్రికా తరఫున శ్యామ్‌కెలె(49వ ని.) ఒక గోల్‌ను కొట్టాడు. దీంతో 5-1 గోల్స్ ఆధిక్యతలో నిలిచింది. మ్యాచ్ ముగియడానికి కొద్ది క్షణా ముందు దక్షిణాఫ్రికాకు పెనాల్టీ స్టోక్ లభించడంతో ఆ జట్టు మరో గోల్ చేసింది. దీంతో భారత్ 5-2గోల్స్ తేడాతో గెలిచింది. అంతకుముందు జరిగిన మరో వర్గీకరణ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు 6-0గోల్స్ తేడాతో వేల్స్‌ను ఓడించింది. దీంతో భారత్, అర్జెంటీనా జట్లు 9వ స్థానంలో నిలువగా.. దక్షిణాఫ్రికా, వేల్స్ 11వ స్థానంలో నిలిచాయి.
- నేడు బెల్జియం-జర్మనీ జట్ల మధ్య టైటిల్ పోరు
భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో ఆదివారం బెల్జియం-జర్మనీ జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన బెల్జియం జట్టు వరుసగా రెండోసారి ఫైనల్లోకి దూసుకురాగా.. జర్మనీ జట్టు అనూహ్య విజయాలతో ఫైనల్‌కు చేరింది. సెమీస్‌లో పటిష్ట ఆస్ట్రేలియాపై 4-3గోల్స్ తేడాతో గెలిచి జర్మనీ తుదిపోరుకు అర్హత సాధించింది. మరోవైపు బెల్జియం పెనాల్టీలలో 3-2గోల్స్ తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఇక గ్రూప్-బి లీగ్ దశలో ఈ రెండుజట్లు ముఖాముఖి తలపడగా ఆ మ్యాచ్ 2-2గోల్స్‌తో డ్రా అయ్యింది.










