May 26,2022 16:34

మాస్కో :  ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలు చేపట్టి 90 రోజులు గడిచాయి. మూడు నెలల యుద్ధం అనంతరం ఉక్రెయిన్‌లో పరిస్థితులు, పాశ్చాత్యదేశాలు వ్యవహరిస్తున్న తీరు, రష్యా ప్రభుత్వ వ్యూహాలను ఒకసారి పరిశీలిద్దాం.. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ చేతిలో రష్యా ఓటమి పాలౌతుందన్న అమెరికా, బ్రిటన్‌ దేశాల కథనాలు కథలుగా మిగిలాయి. ఉక్రెయిన్‌కు సైనిక సహాయం అందిస్తామన్న ఆ దేశాలు చేతులెత్తేశాయి. దీంతో ఉక్రెయిన్‌ విజయం సాధించి తీరుతుందన్న కల్పిత కథనం ఆ ప్రభుత్వాన్ని భ్రమల్లో మునిగేలా చేసింది. యుద్ధాన్ని పొడిగించడానికి, క్రమంగా ఆ యుద్ధంలోకి ప్రవేశించడానికి ఉక్రెయిన్‌ను భ్రమల్లో కొనసాగేలా చేయడం అమెరికా, బ్రిటన్‌లకు అత్యవసరం. రష్యాను అణచివేసేందుకు యుద్ధాన్ని వినియోగించుకోవాలని అమెరికా, బ్రిటన్‌లు యత్నించాయి.

సైనిక చర్యలు ప్రారంభమైన గత మూడు నెలల కాలంలో క్రిమియాకు కారిడార్‌ను ఏర్పాటు చేయడం, అలాగే ఆ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఆర్థిక అవసరాలను అందించడం రష్యా ప్రధాన ప్రాధాన్యతలుగా ఉన్నాయి. అయితే ఆ లక్ష్యం నెరవేరనుంది. ఆ కోణం నుండి డాన్‌బాస్‌లో ప్రస్తుత కార్యాచరణను అర్థం చేసుకోవాల్సి వుంటుంది. ఉక్రెయిన్‌, దాని పాశ్చాత్య మిత్రదేశాలు వాణిజ్య ఆంక్షలతో రష్యా సైనిక, ఆర్థిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయవచ్చని భావించాయి.

అయితే వాస్తవమేమిటంటే... డాన్‌బాస్‌ కోసం చేస్తున్న యుద్ధంలో రష్యా సైన్యం పై చేయి సాధిస్తోంది. ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మంగళవారం మాట్లాడుతూ.. డాన్‌బాస్‌లోని రష్యన్‌ ప్రత్యేక దళాల ఆపరేషన్‌లో అత్యంత చురుకైన దశ ప్రారంభమైందని అన్నారు. ఏడేళ్లుగా ఉక్రెయిన్‌ సైన్యం అడ్డుకుంటున్నప్పటికీ.. పటిష్టమైన ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు రష్యా దళాలు ముందుకు సాగుతున్నాయని అన్నారు. మరియుపోల్‌ను సొంతం చేసుకున్న విజయంతో రష్యా దళాలు ముందుకు దూసుకుపోతున్నాయని అన్నారు.

ప్రపంచబ్యాంక్‌ అంచనాల ప్రకారం.. ఉక్రెయిన్‌ ఆర్థిక వ్యవస్థ 2022 చివరి నాటికి 45 శాతం క్షీణించవచ్చని పేర్కొంది. పాశ్చాత్య దేశాలు భారీ ఆయుధాలను సమకూర్చడంతో... ఈ ఏడాది చివరి నాటికి రష్యాపై ఉక్రెయిన్‌ ఎదురుదాడికి దిగవచ్చన్న చర్చ కలగానే మిగిలిపోతుందని తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి ఉక్రెయిన్‌లో యుద్ధం చేసేందుకు అవసరమైన సిబ్బంది కూడా మిగలకపోవచ్చనేది వాస్తవం. డాన్‌బాస్‌ కోసం ఉక్రెయిన్‌ పలు నిబంధనలతో రష్యాకు లంగిపోయే అవకాశాలున్నాయని తేల్చింది.

రష్యన్‌ సైన్యం ప్రస్తుతం డాన్‌బాస్‌లోని లుహాన్స్క్‌ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించేందుకు యత్నిస్తున్నాయని... ఉక్రెయిన్‌ తూర్పుప్రాంత గవర్నర్‌ అంగీకరించారు. రష్యా అన్ని దిశల్లోనూ ముందుకు సాగుతోందని, అత్యధికంగా సైన్యం, ఆయుధాలను మోహరించిందని అన్నారు. ఉక్రెయిన్‌ దళాలు ఎదుర్కొనేందుకు తగిన పరిస్థితి లేదని.. అక్కడ ప్రమాదకరంగా ఉందని చెప్పారు. డాన్‌బాస్‌లో ప్రధానమైనవి పాప్‌స్నాయ, సెవెరోడోనెట్స్క్‌, ఖార్కివ్‌కి ఉత్తరాన ఉన్న ఇజియం నగరం. మంగళవారం నాటికి రష్యా దళాలు... సెవెరోడోనెట్స్క్‌ లోకి ప్రవేశించగా, పాప్‌స్నాయ, ఇజియం ఇప్పటికే రష్యా నియంత్రణలో ఉన్నాయి. పాప్‌స్నాయ ఉత్తరం, దక్షిణం, తూర్పు మూడు వైపులా రష్యా దళాలు మోహరించాయి. సెవెరోడోనెట్స్క్‌ నగర శివార్లకు చేరుకున్నాయి. అలాగే ఇజియం పశ్చిమం, దక్షిణం నుండి సైన్యం చుట్టుముట్టేందుకు యత్నిస్తోంది.

సోమవారం నాటికి రష్యాదళాలు సెవెరోడోనెట్స్క్‌లోని ఒక వంతెన మినహాయించి అన్నింటిని తమ నియంత్రణలోకి తీసుకున్నాయని జాతీయ మీడియా నివేదకలు స్పష్టం చేశాయి. ఆ మీడియా అక్కడి పరిస్థితిని ఈ విధంగా అంచనా వేసింది. తూర్పు డాన్‌బాస్‌పై నియంత్రణతో ఉక్రెయిన్‌ను ప్రధాన పారిశ్రామిక కేంద్రం నుండి దూరం చేస్తుందని, దీంతో క్రిమియాకు సురక్షితమైన కారిడార్‌ను స్థాపించాలనే రష్యా వ్యూహాత్మక లక్ష్యం నెరవేరుతుందని తెలిపింది. రష్యా దళాల తదుపరి పెద్ద లక్ష్యం స్లోవియన్స్క్‌. ఈ నగరాన్ని నియంత్రించడంతో రష్యా బలగాలు పశ్చిమాన, ఇజియంకు ఆగేయ దిశగా అను సంధానం కావడానికి వీలు కలుగుతుంది. రహదారి మార్గం ద్వారా సరుకుల సరఫరాను నియంత్రించడం, పశ్చిమం నుండి రైలు మార్గాల ద్వారా ఉక్రెయిన్‌లోకి ప్రవేశాన్ని నిరోధించడం ప్రధాన లక్ష్యం. మరియుపోల్‌ రష్యా చేతుల్లోకి వెళ్లింది. ఇప్పుడు క్రిమియాకు భూ రహదారి మార్గాన్ని కలిగి ఉంది. డ్నీపర్‌ నదిని క్రిమియా ద్వీపకల్పానికి కలిపే మంచినీటి కాలువ కూడా ఇప్పుడు రష్యా చేతుల్లో ఉంది. ఈ ద్వీపకల్పానికి ఉత్తరాన ఉన్న అణువిద్యుత్‌ కేంద్రం, పవర్‌గ్రిడ్‌లు రష్యా ఆధీనంలోకి వచ్చాయి. ఇవి రష్యాకు వ్యూహాత్మక లాభాలు.

డాన్‌బాస్‌, క్రిమియా లక్ష్యాలతో పాటు రష్యన్‌ జనాభా అధికంగా ఉన్న క్రిమియా దక్షిణ ప్రాంతాలైన జాపోరిజ్జియా, ఖెర్సన్‌, మైకోలైవల్‌లను విలీనం చేయాలనే డిమాండ్లు ఇప్పటివరకు ఉన్నాయి. రష్యాతో ఈ ప్రాంతం కొంతమేర విలీనం అయ్యేందుకు సిద్ధమైంది.

ఖైర్సన్‌ ప్రాంతంలో రష్యన్‌ కరెన్సీ రూబుల్‌ను వాడుకలోకి తీసుకువచ్చింది. ఉక్రెయిన్‌తో పాటు రష్యన్‌ కూడా జాతీయ భాషగా మారుతోంది. కమ్యూనికేషన్‌, అధికారిక కార్యకలాపాలతో పాటు ఇతర అవసరాలకు రష్యన్‌ ప్రధాన భాషగా మారనుంది. పాఠశాలలు, యూనివర్శిటీలలో బోధన రష్యన్‌ భాషలో నిర్వహించబడుతుంది. ఖేర్సన్‌ ప్రాంతీయ అధికారులు ఈ ప్రాంతంలో రష్యన్‌ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను వినిపిస్తున్నారు.