ప్రజాశక్తి - రాయచోటి టౌన్ : కొంత కాలంగా 44 కేసులకు సంబంధించి 632.08 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్లు ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు అన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని శేట్టివాండ్ల పల్లి రోడ్డు మార్గంలో ఉన్న డంపింగ్ యార్డ్‌లో పట్టుబడిన గంజాయిని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిపి ఆదేశాల మేరకు కొన్ని రోజులుగా స్వాధీనం చేసుకున్న గంజాయిని ధ్వంసం చేశామని తెలిపారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా కింద పోలీసులు అన్ని రకాల చర్యలు చేపట్టారన్నారు. 44 కేసులకు సంబంధించి 632.08 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని దీని విలువ సుమారు రూ.94,81,200 ఉంటుందని, దీన్ని పూర్తిగా అగ్నికి ఆహుతి చేశామన్నారు. గంజాయి యువత పట్ల దుష్ప్రభావం చూపుతాయని, యువత చెడు వ్యసనాల ద్వారా బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గంజాయి నుండి సమాజాన్ని కాపాడుకోవాలన్నారు. ఎక్కడైనా గంజాయి అక్రమ రవాణా గంజాయి వాడడం వంటి సమాచారం పోలీసులకు అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ రాజ్ కమల్, డిఎస్‌పి శ్రీధర్, శ్రీనివాసరావు, సిఐలు, ఎస్‌ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.










