Apr 03,2023 21:12

మాట్లాడుతున్న జిల్లా వక్ఫ్‌ బోర్డ్‌ అధ్యక్షులు కరీముల్లా

 జిల్లా వక్ఫ్‌ బోర్డ్‌ అధ్యక్షులు కరీముల్లా
మదనపల్లె అర్బన్‌ : అన్నమయ్య జిల్లా ముస్లిం ప్రజలు, ముసల్లీలు, ముతవల్లీలు, ధర్మకర్తలు, కమిటీ ప్రెసిడెంట్‌, కమిటీ సభ్యులందరూ వక్ఫ్‌ సంస్థలకు సంబంధించిన భూములను ఈ నెల 30వ తేదీలోపు విధిగా రిజిస్టర్‌ చేయించాలని జిల్లా వక్ఫ్‌ బోర్డ్‌ అధ్యక్షులు ఎస్‌.ఎ.కరీముల్లా తెలిపారు. సోమవారం జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ కార్యాలయంలో కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీల ఆస్తుల పరిరక్షణ, అభివృద్ధికి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, డిప్యూటీ సిఎం అంజాద్‌బాషా, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు. వక్ఫ్‌ ఆస్తులైన మసీదు, దర్గా, ఈద్గా, చావిడి, పీర్ల పంజాలు, అషుర్‌ ఖానాలు, ముసాపీర్‌ ఖాణాలు, తకియా, ముస్లిం స్మశాన వాటికలు, చిల్లాలు, జండా చెట్లు (కట్టలు) మొదలగు అన్ని సంస్థలు వక్ఫ్‌ బోర్డ్‌ పరిధిలోకి వస్తాయన్నారు. కంద్ర ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డ్‌ చట్టం 1995ను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు పరుస్తున్నదని వెల్లడించారు. అన్ని వక్ఫ్‌ సంస్థలు వక్ఫ్‌ బోర్డ్‌ నందు విధిగా రిజిస్టర్‌ చేయించుకోవాలన్నారు. సమావేశంలో వైస్‌ ప్రెసిడెంట్‌ రషీదా బేగం, కార్యదర్శి అమీర్‌, జాయింట్‌ సెక్రటరీ బాషా మోదిన్‌, డైరెక్టర్లు నిసార్‌ అహ్మద్‌, జాకిర్‌ హుసేన్‌, ఫజులుల్లా, షపివుల్లా, సిరాజ్‌, రఫీ పాల్గొన్నారు.