ప్రజాశక్తి-విజయవాడ
స్థానిక కష్ణలంక 21వ డివిజన్‌లో గురువారం జరిగిన ''దేశ రక్షణ భేరి'' ప్రచార పాదయాత్ర సందర్భంగా నిరసన, అనంతరం ఇంటింటికి కరపత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల పెంపును నిరశిస్తూ పాలు, పెరుగు ప్యాకెట్లను ప్రదర్శిస్తూ నాయకులు, కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశ రక్షణ భేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సంద ర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధనాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 14 నుంచి దేశ వ్యాప్త ప్రచారాందోళనలో భాగంగా దేశ రక్షణ భేరి బహరంగ సభను ఈనెల 24న విజయవాడ జింఖానా గ్రౌండ్‌లో సిపిఎం నిర్వహిస్తుందని అన్నారు. ఈ సభకు పార్టీ అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి హాజరవుతున్నారని, దీనిలో ప్రజలు, అభ్యదయవాదులు, ఇతర వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత శాసనసభ సమా వేశాల్లో రాజకీయ గందరగోళాలకు తావు లేకుండా ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాలని, రాష్ట్రాన్ని వంచించిన కేంద్రాన్ని, బిజెపి, మోడీ సర్కార్ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులను కేంద్రం ఇవ్వాలని కోరుతూ అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్ష టిడిపి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యుత్ చట్టానికి సవరణలు తీసుకువచ్చి విద్యుత్ రంగాన్ని ఆదానీలకు, కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్డెదించాలని కోరారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెరిగి అన్నివర్గాలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పాలు, పెరుగు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులపై జిఎస్‌టి విధించి, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ధరలను భారీ మొత్తంలో పెంచారని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి కాశీనాధ్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీలు ఇతర భారాలను రద్దు చేయాలని కోరారు. ప్రజలే గళం విప్పి కేంద్ర సర్కార్ దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పి. కష్ణ, నాయకులు కోరాడ రమణ, శివాజీ పాల్గొన్నారు.
సభను విజయవంతం చేయాలని కరపత్రాల పంపిణీ
కేంద్రంలోని మోడీ ప్రజావ్యతిరేక విధానా లను వ్యతిరేకిస్తూ దేశ రక్షణ భేరి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 24న విజయవాడలోని జింఖానా గ్రౌండ్‌లోజరిగే బహిరంగ సభలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు కె దుర్గారావు కోరారు. గురువారం సింగ్‌నగర్ 60వ డివిజన్‌లో కరపత్రాలను పంపిణీ చేస్తూ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పాలు, పెరుగు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులపై కూడా జిఎస్‌టి విధించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రజాశక్తి-వీరులపాడు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ కోరారు. సిపిఎం చేపట్టిన 'దేశ రక్షణభేరి'లో భాగంగా వీరులపాడు గ్రామంలో గురువారం కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల కుటుంబాలు గడవడం కష్టంగా ఉందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించట్లేదని, కౌలు రైతులకు పంట నష్టపరిహారం అందించడంలేదని, కాలు రైతు గుర్తింపు కార్డులు ఇవ్వట్లేదని పలువురు నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు పట్టుకుంటా చంద్రమోహన్, పార్థసారథి, రవి తదితరులు పాల్గొన్నారు.










