'రెండు పెద్ద గ్రహాలు ఒక్కటైపోయాయా!' అనిపించేంత దగ్గరగా, అంతరిక్షంలో ఈ నెల 21న ఈ మహాద్భుతం జరగబోతుంది. వివరాల్లోకి వెళితే..
అంతరిక్షంలో రెండు పెద్ద గ్రహాలు ఒకదానికి ఒకటి దగ్గరగా వచ్చి.. ఒక్కటైపోయాయేమో అనిపించేలా... రెండు గ్రహాలు కాదు.. ఒకే గ్రహం అనిపించేంత మహాద్భుతం జరగబోతుంది. అంతేకాదు అవి రెండూ దగ్గరగా వచ్చి.. ఓ భారీ నక్షత్రంలా ప్రకాశించనున్నాయి. అవి సౌర కుటుంబంలోని రెండు పెద్ద గ్రహాలైన గురుడు, శని. ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి అత్యంత సమీపంలోకి రానుండడమే దీనికి కారణం. ఆ సమయంలో వాటి మధ్య దూరం 73.50 కోట్ల కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది.
1623వ సంవత్సరం తర్వాత అంటే 397 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ అద్భుతం జరగబోతుంది. ఈ అద్భుతం ఖగోళ ప్రియులకు కనువిందు చేయనుంది. 'మహా సంయోగం'గా ఈ మహాద్భుతాన్ని పిలుస్తారు. ఈ అంతరిక్ష అద్భుతం మనదేశంలోనూ కనువిందు చేయనుంది. మనదేశంలోని అన్ని ప్రాంతాలవారూ సూర్యాస్తమయం తర్వాత చూడవచ్చని కోల్కతాలోని జేపీ బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ దేవీప్రసాద్ దురై పేర్కొన్నారు. మరింకెందుకు ఆలస్యం.. 397 సంవత్సరాల తర్వాత జరిగే ఈ మహాద్భుతాన్ని ఈ నెల 21న వీక్షించడానికి సిద్ధంగా ఉండండి. ఈ అరుదైన అపురూపమైన మహాద్భుతాన్ని చూసే అవకాశం మనకు కలిగింది. తప్పక వీక్షిద్దాం.