ప్రజాశక్తి - ఎడ్యుకేషన్ : విజయవాడ రూరల్ మండలం నున్నలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ ఆధ్వర్యంలో తొలిసారిగా సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు అండర్-14, 17 బాలబాలికల కోసం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించనున్నట్లు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, హైస్కూల్ హెడ్‌మాస్టర్ వజ్రాల భూపాల్‌రెడ్డి తెలిపారు. నున్న హైస్కూల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫస్ట్ అసిస్టెంట్ సూరపనేని రవి ప్రసాద్, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్లు టి.విజయ వర్మ, టి.శ్రీలతతో కలసి ఆహ్వన పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం భూపాల్ రెడ్డి మాట్లాడుతూ వికాస్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్లేగ్రౌండ్‌లో మూడు రోజుల పాటు ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నామన్నారు. ఈ టోర్నీలో మొత్తం 13 జిల్లాల నుంచి 650 మంది రెజ్లర్లు పాల్గొంటారని తెలిపారు. అలాగే, టోర్నీ నిర్వహణకు పాఠశాల అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 650 మంది బాలబాలికలతో పాటు మరో 100 మంది అధికారులు ఈ ఛాంపియన్‌షిప్‌కు హాజరవుతారని తెలిపారు. ఈ మూడు రోజులు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 13 జిల్లాల జట్లు సెప్టెంబర్ 20 సాయంత్రం నున్నలోని వికాస్ కళాశాలలో రిపోర్టు చేయాలని సూచించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక చేసిన, మధ్యప్రదేశ్‌లోని విదీశాలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీన వికాస్ కాలేజీ క్రీడా మైదానంలో పోటీలు ప్రారంభమవుతాయని, ఇందుకోసం అన్ని ఏర్పాటు చేసినట్లు ఫిజికల్ డైరెక్టర్లు విజయ వర్మ, శ్రీలత తెలిపారు.










