Jul 25,2021 16:06

వెస్ట్‌ సస్సెక్స్‌ : హచిసన్‌-గిల్‌ ఫోర్డ్‌ ప్రొగేరియా.. ఇది ఒక అరుదైన సిండ్రోమ్‌. రెండు కోట్ల మందిలో ఏ ఒక్కరిలోనో కనిపించే జన్యు సంబంధ లోపం. ఈ సిండ్రోమ్‌తో బాధపడేవారు వయసుకు మించి పెద్దవారిలా కనిపిస్తారు. టీనేజ్‌లోనే వృద్ధాప్యం వచ్చేస్తుంది. బ్రిటన్‌కు చెందిన అషాంటీ స్మిత్‌ (18) అనే అమ్మాయి కూడా ఈ హచిసన్‌-గిల్‌ ఫోర్డ్‌ ప్రొగేరియా సిండ్రోమ్‌తో బాధపడుతూ మృతిచెందింది. అషాంటీ 8వ ఏట ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఏడాదికి 8 రెట్లు వయసు మళ్లిన లక్షణాలు కనిపించేవి. అయితే, అషాంటీ 18 ఏళ్ల వయసులో కన్నుమూసింది. అప్పటికే తీవ్ర వృద్ధాప్య లక్షణాలు ఆమెను చుట్టుముట్టాయి. కాగా, తాను చనిపోయేంత వరకు తనలోని విషాదాన్ని మౌనంగా భరిస్తూ, అందరినీ నవ్వించేది. పైగా, తాను త్వరలోనే చనిపోతానని తెలిసి కూడా ఆమె ముఖంపై నవ్వు చెరగలేనదని తల్లి లూయిస్‌ స్మిత్‌ వెల్లడించింది. ఆమె బిటిఎస్‌ సంగీతానికి అభిమాని అని, ఆమె అంత్యక్రియల్లో బిటిఎస్‌ సంగీతం వినిపిస్తామని పేర్కొంది. తమ కుమార్తె జ్ఞాపకార్థం హచిసన్‌-గిల్‌ ఫోర్డ్‌ ప్రొగేరియా సిండ్రోమ్‌తో బాధపడే వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడతామని లూయిస్‌ స్మిత్‌ వివరించింది.

18 ఏళ్లకే వృద్ధాప్య లక్షణాలతో యువతి మృతి!