Mar 02,2023 21:33

యువగళం

        అనంతపురం ప్రతినిధి : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పేరుతో గత నెలలో ప్రారంభించిన పాదయాత్ర ఈ నెల 17వ తేదిన సత్యసాయి జిల్లాలోకి ప్రవేశించనుంది. కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన తరువాత 40 రోజుల పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేశ్‌ పాదయాత్ర ఉండనున్నట్ట పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాత్ర రూట్‌ మ్యాప్‌తోపాటు ఏ రకంగా విజయవంతం చేయాలన్న దానిపై జిల్లా టిడిపి నేతలతోపాటు, పార్టీ పరిశీలకులుగానున్న మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రవీంద్రలు గురువారం నాడు కదిరలో ప్రత్యేక సమవేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షులు బికె.పార్థసారధి, పిఎసి ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌, మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌, కందికుంట వెంకట ప్రసాద్‌, ఈరన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాదయాత్ర రూట్‌ మ్యాప్‌పైనా ప్రాథమికంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే మడకశిర, కళ్యాణదుర్గం, రాయదుర్గం మినహా తక్కిన అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర కవర్‌ చేసే విధంగా ప్రణాళిక చేసినట్టు తెలుస్తోంది. నియోజకవర్గానికి కనీసం మూడు రోజులు యాత్ర కొనసాగే విధంగా చూస్తున్నారు. కదిరిలో వారం రోజులుగా జరుగుతున్న వివాదం నేపథ్యంలో ఈ యాత్ర అక్కడి నుంచి ప్రారంభం కానుండటంతో పెద్దఎత్తున పాదయాత్రకు స్పందన లభించే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్న యోచనలో పార్టీ నేతలున్నారు.
        తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి అనంతపురం జిల్లాకు పెట్టని కోట వంటిది. అయితే 2019 ఎన్నికల్లోనే గతంలో ఎన్నడూలేనంత ఎక్కువగా దెబ్బతింది. 14 నియోజకవర్గాల్లో కేవలం రెండు చోట్ల మాత్రమే గెలుపొందింది. 12 నియోజకవర్గాల్లో ఓటమిని చవి చూసింది. ఆ పార్టీ ఇంతటి ఘోర ఓటమిని జిల్లాలో ఎన్నడూ చూడలేదు. ఈ ఎన్నికల్లో దెబ్బతిన్నాక పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది. స్థానిక సంస్థల్లోనూ ఇదే రకంగా దెబ్బతింది. వెనకబడిన తరగతులు పార్టీకి వెన్నుదన్నుగా ఉండేవారు. కాని ఇటీవలి కాలంలో వెనుకబడిన తరగతుల ఓటింగ్‌ చెదిరిపోతున్నట్టు కనిపిస్తోంది. వారు వైసిపి వైపు కూడా మొగ్గు చూపుతుండటంతో టిడిపి దెబ్బతినడానికి కారణమవుతోందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పుడు లోకేశ్‌ పాదయాత్ర ద్వారా చెదిరిన బిసి ఓటరును సమీకరించే ప్రయత్నం చేస్తారా అన్నది చర్చనీయాంశంగా ఉంది. అదే విధంగా సీనియర్లుగానున్న నేతల మధ్యనున్న విభేదాలు కూడా పార్టీని బలహీనపరుస్తున్నాయి. ఓటమి తరువాత కూడా ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు తగ్గడం లేదు. వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లోకేశ్‌ పాదయాత్ర జిల్లాలో 40 రోజుల పాటు నడవనుండటంతో అటు ప్రజల్లోకి వెళ్తూనే, పార్టీని బలపరుచుకోవడంపైనా లోకేశ్‌ దృష్టి సారిస్తారా అన్న చర్చ టిడిపి క్యాడర్‌లో సాగుతోంది. ఈ యాత్రకు వచ్చే స్పందన ద్వారా ఆ పార్టీకి రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఏ రకంగా ఉండనుందన్న అంచనాకూ రావచ్చునని పార్టీ పరిశీలకులు భావిస్తున్నారు.