Mar 11,2022 06:53

రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయని కారణంగా కృష్ణా వరదనీటిని నిల్వ చేసి నీటిని వినియోగించుకునే అవకాశమే లేదు. కొన్ని రిజర్వాయర్లు పూర్తి అయినా పంట కాల్వలు పూర్తి చేయకపోవడంతో శ్రీశైలంలోని నీటిని వినియోగించుకునే పరిస్థితి లేదు. దీనికితోడు రెండు రాష్ట్రాలు పోటీ పడి శ్రీశైలం నీటిని కరెంటు ఉత్పత్తికి ఇష్టం వచ్చినట్లు వాడకున్న పర్యవసానమే అనంత, కర్నూలు జిల్లాల రైతాంగానికి శాపంగా మారింది. ఇప్పటికైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పంటను కాపాడే చిత్తశుద్ధి పాలకుల్లో కనిపించడం లేదు. పొరపాటును సరి చేసుకుని పంటను రక్షించే ప్రయత్నం చేయాలి.

రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన, అత్యల్ప వర్షపాతం, తీవ్ర దుర్భిక్షం, కరువు పీడిత ప్రాంతంగా రాయలసీమను మార్చిన పాపం పాలకులది. ఆ కారణంగానే రాయలసీమ ప్రాంత ప్రజానీకం నిత్యం వలస కూలీలుగా ముంబరు, బెంగళూరు, చెన్నరు, హైదరాబాద్‌ నగరాలకు వెళ్తోంది. రాయలసీమలో సాగుకే గాకుండా తాగడానికి కూడా మంచి నీళ్లు దొరకని గ్రామాలు వేల సంఖ్యలో ఉన్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతోంది. ప్రతిఏటా కృష్ణా, గోదావరి నదుల నుంచి వేలాది టిఎంసిల నీరు వృథాగా సముద్రం పాలవుతోంది. కరువు ప్రాంతమైన రాయలసీమ సాగు, తాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించి దశాబ్దాలు గడిచి పోతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెత చందంగా మారింది. ప్రాజెక్టుల పూర్తికి ఒక్క అడుగు కూడా ముందుకు సాగని అధ్వాన్న పరిస్థితి నెలకొంది. నిత్యం కరువు కాటకాలతో అల్లాడే రాయల సీమ జిల్లాల్లోని అనంతపురం, కర్నూలు జిల్లాల పశ్చిమ ప్రాం తాల్లోని పరిస్థితి మరింత అద్వాన్నంగా ఉంది. అందుకే రాష్ట్రంలో జరిగే రైతుల ఆత్మహత్యలలో అనంతపురం, కర్నూలు జిల్లాలు ప్రథమ, ద్వితీ య స్థానాల్లో నిలుస్తాయి.
        గతేడాది అత్యధికంగా వర్షపాతం నమోదైంది. గత 30 ఏళ్లలో ఎన్నడూ ఇంతటిస్థాయి వర్షపాతం నమోదు కాలేదు. లక్షల ఎకరాలు అధిక వర్షపాతానికి నీళ్లు నిలబడి వేసిన పంటలు కుళ్లిపోయాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అదే పరిస్థితి. రబీని నమ్ముకున్న రైతాంగం హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కింద అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు, ఉరవకొండ, బెలుగుప్ప మండలాల్లోని 50 గ్రామాల పరిధిలో 30 వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండ, కృష్ణగిరి మండలాల్లోనూ సుమారు 25 వేల ఎకరాల్లో వేరుశనగ, మిర్చి, గోరుచిక్కుడు పంటలు సాగు చేశారు. మరొక పర్యాయం పంటలకు సాగునీరు అందించగలిగితే పంట చేతికి అందుతుంది. కానీ కాలువలకు నీరు రావడం ఆగిపోయింది. ఖరీఫ్‌లో అధిక వర్షాలకు నష్టపోయిన రైతన్న, రబీలో నీరు అందక అనంతపురం, కర్నూలు జిల్లాలోని ఐదు మండలాల్లో సుమారు 40 వేల ఎకరాల్లో పంట చేతికి అందివచ్చిందనే ఆనందంలో ఉన్న రైతన్నకు, హంద్రీనీవా కాల్వల ద్వారా నీరందక నిట్టునిలువునా ఎండిపోతుంటే రైతు మనో వేదన ఆకాశాన్నంటుతున్నా, పాలకులకు రైతన్నను ఆదుకోవాలనే చిత్తశుద్ది కనిపించడం లేదు. రైతన్న ఇప్పటికే ఆందోళన బాట పట్టినా పాలక పార్టీలో ఏమాత్రం చలనం కనిపించడం లేదు. 40 వేల ఎకరాల పెట్టుబడి నష్టమే రూ.160 కోట్లు ఉంటుంది. ఈఏడాది అధిక వర్షాలు, తుఫాన్‌ బీభత్సాల కారణంగా తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల రిజర్వాయర్లు అనేక పర్యాయాలు నిండిన సంగతి తెలిసిందే. కానీ ఒక్క అక్టోబర్‌లోనే 2,921 టిఎంసిలు ప్రకాశం బ్యారేజీ నుంచి వృథాగా సముద్రం పాలైంది. రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయని కారణంగా కృష్ణా వరదనీటిని నిల్వ చేసి నీటిని వినియోగించుకునే అవకాశమే లేదు. కొన్ని రిజర్వాయర్లు పూర్తి అయినా పంట కాల్వలు పూర్తి చేయకపోవడంతో శ్రీశైలంలోని నీటిని వినియోగించుకునే పరిస్థితి లేదు. దీనికితోడు.రెండు రాష్ట్రాలు పోటీ పడి శ్రీశైలం నీటిని కరెంటు ఉత్పత్తికి ఇష్టం వచ్చినట్లు వాడకున్న పర్యవసానమే అనంత, కర్నూలు జిల్లాల రైతాంగానికి శాపంగా మారింది. ఇప్పటికైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పంటను కాపాడే చిత్తశుద్ధి పాలకుల్లో కనిపించడం లేదు. పొరపాటును సరి చేసుకుని పంటను రక్షించే ప్రయత్నం చేయాలి. వందల కోట్ల రూపాయల పంటల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కర్నూలు జిల్లా కృష్ణగిరి, పత్తికొండ రిజర్వాయర్లలో 0.56 టిఎంసిలు, అనంత పురం జిల్లాలో జీడిపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్లలో 1.77 టిఎంసిల నీరు నిల్వ ఉంది. మొత్తంగా రిజర్వాయర్లలో 2.33 టిఎంసిలు ఉన్నట్లు తేదీ 3. 11.2022 నాటి అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం నిల్వ ఉన్న 2.33 టిఎం సిలలో కనీసం 1.5 టిఎంసిలు వినియోగించినా 30 వేల ఎకరాల్లోని పంటలకు రెండు తడులు నీటిని అందించే చర్యలు తీసుకోవాల్సి ఉంది. అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన నీటిని లిఫ్ట్‌ చేసి కాల్వల్లోకి విడుదల చేయాల్సి ఉంది.
తక్షణ చర్యలతోపాటు దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి
      హంద్రీనీవా ప్రాజెక్టు సీమ జిల్లాలోని అత్యంత కరువు పీడిత, వెనుకబడిన పశ్చిమ ప్రాంతాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 81 మండలాల పరిధిలోని 33 లక్షల జనాభాకు తాగునీరు అందించే బృహత్తర పథకం. రెండు దశల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో కర్నూలు జిల్లాలో 80 వేల ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1.18 లక్షల ఎకరాలు కలిపి 1.98 లక్షల ఎకరాల సాగు భూమి 10 లక్షల మందికి 144 గ్రామాల్లో తాగునీటిని అందించాలని నిర్దేశించబడింది. రెండవ దశలో అనంతపురం జిల్లాలో 2.27 లక్షల ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1.40 లక్షల ఎకరాలు, కడప జిల్లాలో 37 వేల ఎకరాలు కలిపి 4.04 లక్షల ఎకరాలు సాగుకు, 23 లక్షల మందికి తాగునీరు అందించాలనేది లక్ష్యం. 2005లో ప్రాజెక్టు ప్రారంభ అంచనాలు రెండు దశలూ కలిపి రూ. 3,185 కోట్లుగా ఉంది. 17 ఏళ్లు పూర్తయినప్పటికి మొదటిదశ కూడా పూర్తి కాలేదు. కానీ అంచనా 2019 మార్చి చివరి నాటికి రూ.14.960 కోట్లకు పెరిగింది. 2019 మార్చి చివరి నాటికి పెట్టిన ఖర్చు రూ.12,256 కోట్లు. కానీ ప్రభుత్వ అంచనాల ప్రకారం 2023 నాటికి పూర్తి చేయాలని ఉంది. అప్పటికి రూ.19,789 కోట్లు అవసరం అవుతుందని ప్రకటించింది. కానీ గత రెండు బడ్జెట్ల కేటాయింపులను బట్టి చూస్తే 2023 సంవత్సరానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ పూర్తయ్యే అవకాశమే లేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోకానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపి హయాంలోగానీ వెనుకబడిన, అత్యంత కరువు పీడిత ప్రాంతాల ప్రాజెక్టు అయిన హంద్రీనీవాను పూర్తి చేయాలనే చిత్తశుద్ధి ఏ కోశానా లేదు. ఇక్కడే మరొక అంశాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదని చెప్పడం, రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా అభివృద్ధి అవుతోందని, దివాళా తీసిందని చెప్పడం తప్పా, కేంద్రప్రభుత్వం బాధ్యతల నుంచి వైదొలగి రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని పల్లెత్తు మాట టిడిపి మాట్లాడడం లేదు.
      హంద్రీనీవా ప్రాజెక్టు సమగ్రంగా రూపకల్పన కూడా చేయలేదని కొందరు ఇంజనీర్లు చెబుతున్నారు. 40 టిఎంసిల కృష్ణా వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్నదే గాక, శ్రీశైలం వెనుకజలాలను వరదల సమయంలో 30 రోజుల్లో నీటిని లిఫ్ట్‌ చేసి నిల్వ చేసుకోవాల్సి ఉంది. కానీ మరొక ముఖ్యమైన విషయం కృష్ణా వరద జలాలను, నికర జలాలను భవిష్యత్‌లో వినియోగించుకోవాల్సి ఉంది. గోదావరి నీటిని కృష్ణాకు పోలవరం నుంచి మళ్లించిన తరు వాత 60 టిఎంసిల కంటే ఎక్కువ నీరు వినియోగించుకోవాల్సి ఉంది. ప్రభుత్వంఅందుకు సన్నద్ధంగా ఉన్నట్లు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. హంద్రీనీవా ప్రాజెక్టు ప్రస్తుత డిజైన్‌ ప్రకారం నాలుగు రిజర్వాయర్లలో 8.539 టిఎంసిల నీటి నిలువ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లలో 40 టిఎంసిల నిలువ చేయడం కష్టసాధ్యం. చెరువులకు నీటిని మళ్లించనుంది. అయినా ఏకకాలంలో లిఫ్ట్‌ చేసి మళ్లించే నీటిని చెరువులకు నింపి నిలువ చేయడం సాధ్యం కాదు. అందువల్ల వరద రోజుల్లో నీటిని నిల్వ చేయడానికి అనుగుణంగా రిజర్వాయర్ల సామర్థ్యం పెంచడంతోపాటు కొత్త రిజార్వయర్లు మరికొన్ని నిర్మించడానికి రూపకల్పన చేయాల్సి ఉంది. అప్పుడే హంద్రీనీవా సాగు, తాగునీటి ప్రాజెక్టు నిర్మాణం కరువు పీడిత రాయలసీమ ప్రయోజనా లను సఫలీకృతం చేయగలదు.
                                              రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయని కారణంగా కృష్ణా వరదనీటిని నిల్వ చేసి నీటిని వినియోగించుకునే అవకాశమే లేదు. కొన్ని రిజర్వాయర్లు పూర్తి అయినా పంట కాల్వలు పూర్తి చేయకపోవడంతో శ్రీశైలంలోని నీటిని వినియోగించుకునే పరిస్థితి లేదు. దీనికితోడు రెండు రాష్ట్రాలు పోటీ పడి శ్రీశైలం నీటిని కరెంటు ఉత్పత్తికి ఇష్టం వచ్చినట్లు వాడకున్న పర్యవసానమే అనంత, కర్నూలు జిల్లాల రైతాంగానికి శాపంగా మారింది. ఇప్పటికైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పంటను కాపాడే చిత్తశుద్ధి పాలకుల్లో కనిపించడం లేదు. పొరపాటును సరి చేసుకుని పంటను రక్షించే ప్రయత్నం చేయాలి.     

          బి.నారాయణ,  రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు  -  సెల్‌ నెంబర్‌ : 9490098843