రాయచోటి: 2024లో రాబోయే సాధారణ ఎన్నికల దృష్ట్యా ఈవిఎంలను భద్రపరచే నిమిత్తం గోడౌన్ల వివరాలను ఎన్నికల కమిషన్‌కు ఈ నెల 12లోగా పంపించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి నూతన జిల్లాలలో ఈవిఎంలు భద్రపరచడానికి అవసరమైన గోడౌన్ల ఎంపిక అంశంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఈవిఎంలు భద్రపరిచే గోడౌన్ల ఎంపికలో కమిషన్ మార్గదర్శకాలు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఈవిఎంలకు రక్షణ, భద్రతకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గోడౌన్ పటిష్టవంతంగా ఉండాలన్నారు. ఎంపిక చేసే గోడౌన్ కనీసం 10 వేల నుంచి 15 వేల చదరపు అడుగులు ఉండాలని, అందులో జిల్లాకు సంబంధించిన మొత్తం బియూలు, సియులు, వివి ప్యాట్ తదితరాలను భద్రపరచాల్సి ఉంటుందన్నారు. ఈవిఎంలను భద్రపరిచే గోడౌన్లు వర్షాలకు కారకుండా, పగుళ్లు లేకుండా పటిష్టవంతంగా, కట్టుదిట్టంగా భవనం ఉండాలన్నారు. ముఖ్యంగా ఆర్.సి భవనాలను ఎంపిక చేయాలని సూచించారు. ఎంపిక చేసే ఈవీఎం గోడౌన్లను కలెక్టర్లు స్వయంగా పరిశీలించాలన్నారు. భద్రత పరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలకు అనుకూలంగా ఉండేలా భవనం ఎంపిక చేయాలని చెప్పారు. త్వరలోనే నూతనంగా ఏర్పడిన అన్ని జిల్లాలకు ఈవిఎంలను పంపడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గిరీష మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాకు సంబంధించి రాయచోటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో ఇటీవల నూతనంగా నిర్మించిన భవనాన్ని ఈవిఎంలను భద్రపరచడానికి గోడౌన్ కొరకు పరిశీలించామన్నారు. దాన్ని ఇటీవలే నూతనంగా నిర్మించారని, లీకేజీలకు ఆస్కారం లేదని, భవనం పటిష్టంగా ఉందని, ఈవిఎంలను భద్రపరచడానికి అనుకూలంగా ఉంటుందని వివరించారు. ఈ భవనం జాతీయ రహదారికి పక్కనే ఉందని, నూతన కలెక్టరేట్‌కు కూడా సమీపంలో ఉందని తెలిపారు. మరో రెండు భవనాలను కూడా ప్రత్యామ్నాయంగా పరిశీలన చేశామని కమిషన్ మార్గదర్శకాల మేరకు అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈవిఎంలను భద్రపరిచే గోడౌన్ వివరాలను రేపటికల్లా కమిషన్‌కు నివేదిక పంపుతామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఒ సత్యనారాయణ, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ పాల్గొన్నారు.










