Apr 02,2023 13:19

ఐదు కాదు పది కాదు.. ఏకంగా 28 ఏండ్ల ఐసీసీ ప్రపంచకప్‌ ట్రోఫీ కరువును తీరుస్తూ ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ధోని సేన సృష్టించిన చరిత్రకు నేటి 12 ఏళ్లు. 1983లో కపిల్‌ భారత్‌కు తొలి ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ అందించిన తర్వాత సుదీర్ఘకాలం టీమిండియా ప్రపంచకప్‌ గెలవలేదు. సచిన్‌, అజారుద్దీన్‌, గంగూలీ, ద్రావిడ్‌ వంటి మహామహుల వల్ల కాని అసాధ్యాన్ని ధోని సేన సుసాధ్యం చేసిన ఆ క్షణాలు భారత క్రికెటలో ఎప్పటికీ మధురమే. 'ధోనీ.. ఫినిషెస్‌ ఆఫ్‌ ఇన్‌ స్టైల్‌.. ఇట్స్‌ మెగ్నిఫిషెంట్‌ స్ట్రైక్‌ ఇంటూ ది క్రౌడ్‌. ఇండియా లిఫ్ట్‌ ది వరల్డ్‌ కప్‌ ఆఫ్టర్‌ 28 ఈయర్స్‌...' అంటూ కామెంట్రీ బాక్స్‌ లో రవిశాస్త్రి పలుకులు క్రికెట్‌ అభిమానుల చెవుల్లో ఇంకా మారుమ్రోగుతున్నాయి'.
2011 తర్వాత భారత్‌ మళ్లీ వన్డే వరల్డ్‌ కప్‌ గెలవలేదు. వన్డేలే కాదు టీ20లలో కూడా భారత్‌కు నిరాశే.. 2013లో ఇంగ్లాండ్‌లో నిర్వహించిన ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత భారత్‌.. ఐసీసీ ట్రోఫీలలో విఫలమవుతూనే ఉంది. ఈ ఏడాది భారత్‌ కు ఐసీసీ ట్రోఫీగా నిలవడానికి రెండు ఛాన్స్‌లు ఉన్నాయి. 2023 జూన్‌లో ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌ ఉంది. ఇప్పటికే ఫైనల్‌ చేరిన భారత జట్టు.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. అంతేగాక ఈ ఏడాది అక్టోబర్‌లో స్వదేశంలోనే జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ను రోహిత్‌ సేన సాధిస్తుందా.. వేచి చూడాలి