10వ తరగతి విద్యార్థులకు శిక్షణ
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : పదవ తరగతి విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి ర్యాంకులతో పాస్ కావాలని జిల్లా బిసి సంక్షేమ శాఖ, సాధికారత అధికారి వై.వెంకటయ్య పేర్కొన్నారు. ఆదివారం ఆత్మకూరు పట్టణంలోని పాలిటెక్నికల్ కళాశాలలో ఆత్మకూరు డివిజన్ స్థాయి బిసి వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు ప్రేరణ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిడి వై.వెంకటయ్య మాట్లాడుతూ రానున్న పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు భయపడకుండా, ఆందోళన చెందకుండా ఉండేందుకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే విద్యార్థులకు ప్రేరణ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులకు అన్ని సబ్జెక్టులపై అవగాహన కల్పించినట్లు వివరించారు. ఆత్మకూరు బిసి సహాయ సంక్షేమ శాఖ అధికారిణి శ్రీదేవి మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు రానున్న పరీక్షల్లో కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని. విద్యార్థులకు విద్యతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు వెలిశెట్టి నారాయణ, తెలుగు వ్యక్తిత్వ నిపుణులు ఎం.ప్రసాద్, వెంకటరెడ్డి సురేష్ ఆర్ వెంకటేశ్వర్లు రెడ్డి, వార్డెన్లు ఉన్నారు.










