- ఈ ఏడాది పడిపోయిన ధాన్యం ఉత్పత్తి
- నిరుటి దిగుబడిలో 5 లక్షల టన్నులు కోత
- విపత్తులు, ఆంక్షల ఎఫెక్టు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఈ ఏడాది ప్రభుత్వ అంచనాల కంటే వరి ధాన్యం దిగుబడి దాదాపు పది లక్షల టన్నులు తగ్గనున్నాయి. నిరుడు లభించిన ఉత్పత్తి కంటే ఐదు లక్షల టన్నుల వరకు తగ్గనున్నాయి. ఖరీఫ్‌లో తుపాన్లు, అధిక వర్షాలు, వరదలు, వర్షాభావం, రబీలో వరి సేద్యంపై ఆంక్షల వలన ధాన్యం ఉత్పాదకత, ఉత్పత్తి తగ్గనుంది. ఖరీఫ్, రబీ సాగు, ఉత్పత్తి, ఉత్పాదకతలపై ప్రభుత్వం రెండవ ముందస్తు అంచనాలు రూపొందించింది. రెండు సీజన్లూ కలుపుకొని 2021-22లో 24.20 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుందని, తద్వారా 135.24 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని పేర్కొంది. కాలం గడుస్తున్నకొద్దీ ఆచరణలో సదరు అంచనాలు కార్యరూపం దాల్చే పరిస్థితి కనిపించడం లేదు. చివరికొచ్చేసరికి 125 లక్షల టన్నులే లభిస్తాయని ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రభుత్వ రెండవ ముందస్తు అంచనా కంటే కనీసం పది లక్షల టన్నులు తగ్గుతాయని చెబుతున్నారు. నిరుడు ఖరీఫ్, రబీ కలుపుకొని 130.89 లక్షల టన్నులొచ్చాయి. అంతకంటే ఐదు లక్షల టన్నుల వరకు ఈ సంవత్సరం ఉత్పత్తి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
ఖరీఫ్‌లో అలా..
ఖరీఫ్‌ను ఆది నుండి విపత్తులు వెంటాడుతూనే ఉన్నాయి. ఉత్తరాంధ్ర, ప్రకాశం, నెల్లూరు దాదాపు సీజన్ అంతా వర్షాభావంలో మగ్గాయి. అదనుకు వానల్లేక పంటల సాగు సరిగ్గా జరగలేదు. రాష్ట్రంలో అక్కడక్కడ డ్రైస్పెల్స్ నెలకొన్నాయి. ఇదే సమయంలో అధిక వర్షాలు, తుపాన్లు, వరదలు ముంచెత్తడంతో వరికి నష్టం వాటిల్లింది. ప్రభుత్వమే దాదాపు రెండున్నర లక్షల హెక్టార్లలో వరి దెబ్బతిందని తేల్చింది. ఉత్పత్తి నష్టం కొన్ని లక్షల టన్నులుగా చెబుతున్నారు. విపత్తుల వలన అనుకున్న విధంగా ఉత్పాదకత వచ్చే అవకాశం లేదు. హెక్టారుకు 4,933 కిలోల ఉత్పాదకత ఆశించగా 200-300 కిలోల వరకు తగ్గొచ్చు. ఆ మేరకు ఉత్పత్తి నష్టం వాటిల్లనుంది.
రబీలో ఇలా...
ఖరీఫ్ పంటలపై తరచు విపత్తులు దాడి చేస్తుంటాయి. ఆ ప్రభావంతో ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గుతుంటుంది. రబీలో అయితే వేసిన పంట చేతికొస్తుందన్న కనీస గ్యారంటీ ఉంటుంది. అంతేకాకుండా ఖరీఫ్‌తో పోల్చితే రబీలో ఉత్పాదకత కొంచెం ఎక్కువ వస్తుంది. అందుకే వరి రైతులు రబీపై ఆశలు పెట్టుకుంటారు. ఖరీఫ్ నష్టాలను రబీలో కొంతైనా పూడ్చుకోవాలనుకుంటారు. కానీ ప్రభుత్వం ఈ మారు రబీ వరిపై ఆంక్షలు పెట్టింది. నీటి వసతులున్న ప్రాంతాల్లోనూ వరి వేయొద్దని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయలంటోంది. మరో వైపు గత రబీలో, ప్రస్తుత ఖరీఫ్‌లో ధాన్యం ధరకు ప్రభుత్వ భరోసా లేదు. దాంతో ఈ తడవ వరి సాగు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుడు రబీలో 9.51 లక్షల హెక్టార్లు సాగు కాగా, ఈ ఏట ప్రభుత్వం 7.89 లక్షల హెక్టార్లకు అంచనాలను కుదించింది. దాదాపు రెండు లక్షల హెక్టార్ల సాగు తగ్గుతుందని సర్కారే చెబుతోంది. నిరుడు 63.29 లక్షల టన్నులు రాగా, ప్రభుత్వం తాజా అంచనాల్లో 54.78 లక్షల టన్నులకు తగ్గించింది. ఉత్పాదకత 6,943 కిలోలుగా పేర్కొంది. నిరుడు రబీలో సాగు పెరిగినా ఉత్పాదకత 6,555 కిలోలే వచ్చింది. అలాగే ఈ ఏటా ఉత్పాదకత తగ్గితే ఆ వారా ఉత్పత్తి ఇంకా తగ్గుతుంది.











