ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పుగోదావరి) : మార్చి నెలాఖరికి కచ్చితంగా నూరు శాతం ఇంటి పన్నులు వసూళ్లయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిణి పి.జగదాంబ మండల అధికారులకు పిలుపునిచ్చారు. మంగళవారం చిలకపాడు గ్రామాన్ని ఆమె సందర్శించి, కార్యాలయంలో నిర్వహిస్తున్న ఇంటి పన్ను వసూళ్లు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, ఈ-సేవా కేంద్రం సేవలను ఆమె సమీక్షించారు. దీంతోపాటు ఎస్ డబ్ల్యూ పి సి షెడ్‌ను సందర్శించి, స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. తయారై ఉన్న 600 కిలోల వర్మీ కంపోస్టును వెంటనే విక్రయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీడీ ముత్యం వీరాస్వామి నాయుడు, కార్యదర్శి కె. రఘుపతి, గ్రామ పెద్ద పి.పోచేశ్వరరావు తదితరులు ఉన్నారు.










