-కాలువలో కారు బోల్తా
- ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి :తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాలువలో కారు బోల్తా పడడంతో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... ఏలూరు సమీపంలోని శ్రీ రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న పది మంది విద్యార్థులు శనివారం ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలోని గుడెసె పర్యాటక ప్రాంతానికి రెండు కార్లలో వెళ్లారు. అక్కడ ఉల్లాసంగా గడిపి సాయంత్రం అవే కార్లలో తిరుగు పయనమయ్యారు. శనివారం అర్ధరాత్రి కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద ఒక కారు అదుపు తప్పి పక్కనే ఉన్న కొండ కాలువలో పడిపోయింది. ఈ సమయంలో కారులో డ్రైవర్, ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో కాలువలోనుంచి కారుని బయటకు తీశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏలూరు జిల్లా తంగెళ్లమూడికి చెందిన కారు డ్రైవర్ పలివెల ప్రణీత్, దెందులూరుకు చెందిన వేమూరి వంశీ, తూర్పుగోదావరి జిల్లా పెరవళి మండలం నడిపల్లికోటకు చెందిన కరటూరు హేమంత్‌లను అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగతా ముగ్గురి కోసం కాలువలో గాలించారు. తొలుత కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరవల్లికి చెందిన ఉదరుకిరణ్ (19) మృతదేహాన్ని గుర్తించారు. ఏలూరు హనుమాన్ నగర్‌కు చెందిన టి.హేమంత్ (19), పెద్దపాడుకు చెందిన దూడే హర్షవర్థన్ (19) మృతదేహాలు కూడా ఆ తర్వాత లభ్యమయ్యాయి. కొండ కాలువలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గాలింపు చర్యలు కష్టతరంగా మారాయని, ఎట్టకేలకు మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు.










