ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పు గోదావరి) : గర్భిణీని కాన్పు కోసం 108 వాహనంలో ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో వాహనంలోనే ప్రసవించిన ఘటన మండలంలోని కాల్దారిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎం.మంగమ్మ అనే గర్భిణీకి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆశా వర్కర్ ను సంప్రదించారు. ఆమె, ఉండ్రాజవరం 108 సిబ్బంది గర్భిణీని ఉండ్రాజవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు అధికం కావడంతో ఈఎంటీ వరప్రసాద్, పైలట్ చంద్రశేఖర్‌లు, ఆశావర్కర్ల సహాయంతో డెలివరీ చేశారు. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు. తదుపరి చికిత్స కోసం ఉండ్రాజవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగమ్మ కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.










